ట్రంప్‌ అరెస్టయితే వాట్‌ నెక్ట్స్‌? అమెరికాలో కల్లోలం రేగుతుందా?

Trump says he expects to be arrested, calls for protest - Sakshi

నన్ను అరెస్ట్‌ చేస్తారంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా కల్లోలం రేగింది. శృంగార తారతో లైంగిక సంబంధాల్ని పెట్టుకొని 2016 ఏడాదిలో అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరెత్తకుండా ట్రంప్‌ భారీగా డబ్బులు ముట్టజెప్పారన్న కేసును న్యూయార్క్‌ జ్యూరీ గత కొన్ని వారాలుగా రహస్య విచారణ సాగిస్తోంది. కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో ఆయనపై నేరాభియోగాలు నమోదవుతాయనే అనుమానాలు బలపడుతున్నాయి.

ట్రంప్‌పైనున్న కేసు ఏమిటి?
డొనాల్డ్‌ ట్రంప్‌ లైంగిక సంబంధాల ఆరోపణలపై కేసు విచారణ జరుగుతోంది. 2006 ఏడాదిలో తనకు 27 ఏళ్ల వయసున్నప్పుడు ట్రంప్‌ తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నారని పోర్న్‌ సినిమాల్లో నటించే స్టార్మీ డేనియెల్స్‌ ఒకప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని బయట ఎక్కడా వెల్లడించవద్దని బెదిరించేవారని డేనియెల్స్‌ ఆరోపించారు.

ట్రంప్‌ నిర్వహించే రియాల్టీ షో ‘ది అప్రెంటీస్‌’లో అవకాశం ఇస్తానని ఆశ కల్పించి తనతో గడిపారని ఆరోపణలు గుప్పించారు. అప్పుడప్పుడు తనకి ఫోన్‌ చేసి హనీబంచ్‌ అని ముద్దుగా పిలిచేవారని చెప్పుకొచ్చారు. 2016లో ట్రంప్‌ అమెరికా అధ్యక్ష బరిలో ఉన్నప్పుడు ఆమె ఈ విషయాలపై నోరెత్తకుండా ఉండేందుకు లక్షా 30 వేల డాలర్లు ముట్టజెప్పారట.

ట్రంప్‌ మాజీ లాయర్‌ మైఖేల్‌ కొహెన్‌ తొలుత ఈ డబ్బులు డేనియెల్స్‌కు చెల్లిస్తే, ఆ తర్వాత ట్రంప్‌ మైఖేల్‌కి డబ్బులు ఇచ్చారు. మైఖేల్‌ తనకు డబ్బులు ఇచ్చినట్టుగా డేనియల్స్‌ చెబుతూ ఉంటే, అవి లాయర్‌కి ఫీజు చెల్లించినట్టుగా ట్రంప్‌ చెప్పుకుంటున్నారు. 

ఏం జరగబోతోంది ?  
డబ్బులిచ్చి పోర్న్‌ స్టార్‌ నోరుమూయించారన్న ఆరోపణలపై న్యూయార్క్‌ గ్రాండ్‌ జ్యూరీ ఆధారాలన్నీ సేకరించినట్టు తెలుస్తోంది. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆయన మాజీ లాయర్‌ కోహెన్‌ సాక్ష్యమిచ్చారు. డేనియెల్స్‌కు డబ్బులు ఇచ్చినట్టుగా కోర్టు ఎదుట అంగీకరించారు. మైఖేల్‌ కోహెన్‌కు లీగల్‌ అడ్వైజర్‌గా పని చేసిన రాబర్ట్‌ కోస్టెల్లో ఇన్నాళ్లూ ట్రంప్‌కు వ్యతిరేకంగా జ్యూరీలో మాట్లాడి ఇప్పుడు ఎదురు తిరిగినట్టుగా తెలుస్తోంది.

ట్రంప్‌కి అనుకూలంగా సాక్ష్యమిచ్చినట్టుగా సమాచారం. ట్రంప్‌ కోర్టుకి హాజరు కాకూడదని నిర్ణయించుకోవడంతో విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రాండ్‌ జ్యూరీ ఏం చెయ్యాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ఒక కేసులో నిందితుడిని దోషిగా లేదంటే నిరపరాధిగా తేల్చే అధికారం గ్రాండ్‌ జ్యూరీకి ఉండదు. కేవలం ఆధారాలు సేకరించి నేరాభియోగాలు మోపగలదు.

అయితే మన్‌హటన్‌ జిల్లా అటార్నీ అల్విన్‌ బ్రాగ్‌ తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌. ఆధారాలుంటే నిందితుడ్ని అరెస్ట్‌ చేసి క్రిమినల్‌ కేసుని నమోదు చేస్తారు. అదే జరిగితే తొలిసారి క్రిమినల్‌ కేసులుఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ అవుతారు. ఈ అభియోగాలు రుజువై ట్రంప్‌ దోషిగా తేలితే నాలుగేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా?  
రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడతానని ప్రకటించిన ట్రంప్‌ ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు. దేశాధ్యక్షుడిగా పోటీ పడే వ్యక్తి నేరచరిత్ర, జైలు జీవితం వంటి అంశాలపై అమెరికా రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావన లేదు. దీంతో జైలు శిక్ష అనుభవిస్తూ అధ్యక్షుడయ్యే అవకాశం అభ్యర్థికి ఉంది.

సాంకేతికంగా ఎలాంటి అడ్డంకులు లేకపోయినప్పటికీ ఈ నేరారోపణలు నైతికంగా ట్రంప్‌ను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రిమినల్‌ కేసులో ఇరుక్కున్న వ్యక్తి ఓట్లు అడగడం, చర్చా కార్యక్రమంలో పాల్గొనడం వంటివి ప్రజల ఎదుట ఆయన స్థాయిని తగ్గిస్తాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

క్యాపిటల్‌ దాడుల్ని తలపిస్తాయా?  
ట్రంప్‌ అరెస్ట్‌యితే దేశంలో ఆయన అనుచరులు ఎలాంటి పరిస్థితులు సృష్టిస్తారోనన్న ఆందోళనలు ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్‌ తాను అరెస్ట్‌ అవుతానని, అందరూ నిరసనలకు దిగాలంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. ‘బైడెన్‌ ప్రభుత్వం అశాంతిని రేపుతోంది. దేశాన్నే చంపేస్తోంది. ఇదే తగిన సమయం. మనందరం మేల్కోవాలి. గట్టిగా నిరసనకు దిగాలి’ అని ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిచ్చారు.

2021 జనవరిలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఎన్నికల్లో అక్రమాల కారణంగానే తాను ఓడిపోయాయని ట్రంప్‌ భావించడం, ఆయన అనుచరులు అమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడి, హింసాకాండతో దేశం అట్టుడికిపోయింది. ఈసారి ట్రంప్‌ అనుచరులు న్యూయార్క్‌ కోర్టుపై దాడులకు తెగబడతారన్న అనుమానాలున్నాయి.

మన్‌హటన్‌ న్యాయవాది బ్రాగ్‌ న్యూయార్క్‌ పోలీసులతో మాట్లాడి కోర్టుకు కట్టుదిట్టమైన భద్రత కలి్పంచాల్సిందిగా రాసిన లేఖ ఒకటి మీడియాకు లభ్యమైంది. కోర్టులు, ఇతర కార్యాలయాలపై ఎవరి కన్ను పడినా, వారిని పూర్తిగా విచారించే ప్రయత్నంలో పోలీసు యంత్రాంగం ఉంది.

ట్రంప్‌ ఎదుర్కొంటున్న ఇతర కేసులు
డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో ప్రభుత్వ రహస్య పత్రాలను ఫ్లోరిడాలో తన ఎస్టేట్‌కు తీసుకునివెళ్లారన్న ఆరోపణలపై కేసు విచారణ     
కొనసాగుతోంది. 
♦ అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాతఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్‌అనుచరులు 2021 జనవరి 6నఅమెరికన్‌ క్యాపిటల్‌ భవనంపై దాడి చేసి హింసాకాండ సృష్టించిన కేసు.  
♦ 2020 అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేలా ట్రంప్, ఆయన అనుచరులబృందం నడుచుకున్నట్టు నమోదైన కేసు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top