వాషింగ్టన్: హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫాక్స్ న్యూస్ జర్నలిస్ట్ ట్రే యింగ్‌స్ట్‌కు ట్రంప్ టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో.. ఇరాన్ ఎలాంటి షరతులు లేకుండా హర్మూజ్ జలసంధిపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలి. లేదంటే అన్నింటిని పేల్చేస్తాం. ఇరాన్ చమురును స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
అంతేకాదు.. హర్మూజ్ జలసంధించిన తెరిచేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ ప్రతినిధులకు పరిమిత క్షమాభిక్ష ప్రసాదించినట్లు తెలిపారు. అయితే, ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. చర్చలు విఫలమైతే, కీలక ఆస్తులను ధ్వంసం చేయడం, ఇరాన్ చమురు వనరులను స్వాధీనం చేసుకోవడంతో సహా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తాము ఇరాన్ నిరసనకారులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారికి ఆయుధాలు పంపించాం. ఆ ఆయుధాలు నిజంగా నిరసనకారుల చేతికి చేరలేదని, మధ్యలో కుర్దిష్ మార్గాల ద్వారా వెళ్లి.. కుర్దిష్ సమూహాల దగ్గరే ఉండిపోయి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే ట్రంప్ జారీ చేసిన అల్టిమేటం గడువు ముగియనున్న తరుణంలో ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ట్రంప్ హెచ్చరికల్ని ఇరాన్ తోసిపుచ్చింది . ఇరాన్ కేంద్ర సైనిక కమాండ్ జనరల్ అలీయాబాది, ట్రంప్ బెదిరింపును నిస్సహాయమైన, ఆందోళనతో కూడిన, అస్థిరమైన, తెలివితక్కువ చర్య అని అన్నారు.
ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి మాట్లాడుతూ.. శత్రుత్వం పెరిగితే ఇరాన్‌లో మీకు నరకం కనబడుతోంది. ఇరాన్‌ను ఓడించాలన్న మీ భ్రమ ఊబిగా మారి మీరు అందులో కూరుకుపోతారు’అని రెచ్చగొట్టారు. మరి రేపటితో ముగియనున్న డెడ్ లైన్ అనంతరం, ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది.
కాగా, హోర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారా జరుగుతుంది.ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే, అంతర్జాతీయ చమురు ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అందుకే అమెరికా దీనిని ప్రపంచ ఆర్థిక భద్రతకు ముప్పుగా చూస్తోంది.


