ఉద్యోగులందరికీ వారానికి 2 రోజుల చొప్పున సెలవులు | Nepal Introduces Two Day Weekend Holidays In Wake Of Fuel Crisis, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఉద్యోగులందరికీ వారానికి 2 రోజుల చొప్పున సెలవులు

Apr 5 2026 9:30 PM | Updated on Apr 6 2026 4:46 PM

 Nepal introduces two-day weekend holidays in wake of fuel crisis

కాఠ్మాండు: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతుండడంతో పలు దేశాల‍్లో అనేక కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం నేపాల్‌పై బాగా పడుతోంది. సాధారణంగా ఆదివారం సెలవు ఉంటుంది. అయితే, చమురు సంక్షోభం వల్ల నేపాల్‌ వారానికి రెండు రోజులు సెలవులను అమలు చేయాలని నేపాల్ ప్రభుత్వం ఆదివారం (ఏప్రిల్‌ 5)  నిర్ణయించింది.

ఈ నిర్ణయాన్ని కాఠ్మాండులో ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలు ఏప్రిల్ 6 నుంచి కొత్త వీకెండ్‌ షెడ్యూల్‌ను పాటించనున్నాయని ప్రభుత్వ ప్రతినిధి సస్మిత్ పోఖరేల్ తెలిపారు. పెట్రోలియం సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

పోఖరేల్ మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోలియం సరఫరా అంతరాయాల కారణంగా ఆదివారాల్లో కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. విద్యాసంస్థలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి.

పెట్రోల్, డీజిల్ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చేందుకు అవసరమైన చట్టపరమైన రూపకల్పనను సిద్ధం చేయాలని కూడా నేపాల్‌ మంత్రివర్గం నిర్ణయించింది. ఇంధన సరఫరా అనిశ్చితి పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోఖరేల్‌ తెలిపారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చడం ద్వారా ఇంధన కొరతను ఎదుర్కోవచ్చని, పర్యావరణహిత రవాణా దిశగా మార్పునకు ఇది తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇరాన్, ఇజ్రాయెల్అ-మెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ పెట్రోలియం సరఫరాను దెబ్బతీసింది. దీని వల్ల నేపాల్‌లో కొరతతో పాటు ధరలు భారీగా పెరిగాయి.

నేపాల్‌లో పెట్రోలియం ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరాయి. రాష్ట్ర సంస్థ నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ తాజా సవరణ ప్రకారం.. కాఠ్మాండు లోయలో పెట్రోల్ ధర లీటరుకు ఎన్‌పీఆర్‌ 202కి చేరింది. డీజిల్, కిరోసిన్ ధరలు లీటరుకు ఎన్‌పీఆర్‌ ఎన్‌పీఆర్‌182కి పెరిగింది.

గత వారం సంస్థ బోర్డు సమావేశంలో లీటరుకు ఎన్‌పీఆర్‌ 15 పెంపునకు ఆమోదించారు. 18 రోజుల్లో మూడోసారి ధరలు పెంచారు. మార్చి 15, మార్చి 25న కూడా ధరలను పెంచారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement