
దుబాయ్: అఫ్గానిస్తాన్‌లో ఏడు నెలలుగా నిర్బంధంలో ఉంచుకున్న బ్రిటన్ జంటను తాలిబన్లు శుక్రవారం విడిచిపెట్టారు. పీటర్ రేనాల్ట్సŠ(80), బార్బీ రేనాల్డ్స్(75) దంపతులు అఫ్గానిస్తాన్‌లోని బామియన్‌లో గత 18 ఏళ్లుగా విద్య, శిక్షణ సంస్థలను నిర్వహిస్తున్నారు. 2021లో అమెరికా ప్రభుత్వం దన్నుతో నడుస్తున్న ప్రభుత్వాన్ని తాలిబన్లు కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాతా వీరు అక్కడే ఉంటున్నారు.
అయితే, వీరు చట్టాలను ఉల్లంఘించారంటూ తాలిబన్ యంత్రాంగం అదుపులోకి తీసుకుని, గుర్తు తెలియని ప్రాంతంలో నిర్బంధించింది. బ్రిటన్ వినతి మేరకు రంగంలోకి దిగిన ఖతార్ ప్రభుత్వం దంపతుల విడుదలపై తాలిబన్లతో చర్చలు జరిపింది. చర్చలు ఫలప్రదం కావడంతో రేనాల్డ్స్ దంపతులను తాలిబన్లు విడిచిపెట్టారు. శుక్రవారం వీరు కాబూల్ నుంచి విమానంలో స్వదేశానికి బయలుదేరారు. అఫ్గాన్‌లోని తాలిబన్ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల గుర్తింపు లభించలేదు.
దీంతో, వీరు రేనాల్డ్స్ దంపతులను నిర్బంధించడం ద్వారా తమ డిమాండ్లపై బేరసారాలకు దిగినట్లుగా భావిస్తున్నారు. అమెరికాకు చెందిన పర్యాటకుడు జార్జి గ్లెజ్‌మాన్‌ను నిర్బధంలోకి తీసుకున్న తాలిబన్లు అనంతరం ఆ దేశంతో ఖైదీల మార్పిడి ఒప్పందం కుదుర్చుకుని, ఇటీవల విడుదల చేయడం తెల్సిందే.