హర్ముజ్‌లో భారత నౌకల ప్రయాణం .. సీక్రెట్‌ స్ట్రాటజీ ఇదే..! | strait hormuz is shut indian ships still passing centre shares secret strategy | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌లో భారత నౌకల ప్రయాణం .. సీక్రెట్‌ స్ట్రాటజీ ఇదే..!

May 30 2026 2:20 AM | Updated on May 30 2026 2:25 AM

strait hormuz is shut indian ships still passing centre shares secret strategy

ఢిల్లీ: హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి పలు దేశాల్లో లాక్‌డౌన్‌లు సైతం విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంత సంక్షోభం సమయంలోనూ భారత నౌకలు మాత్రం నిరాటంకంగా హర్ముజ్‌లో రాకపోకలు సాగించాయి. దీనికి భారత అనుసరించిన వ్యూహాన్ని తాజాగా అధికారులు వెల్లడించారు.    

అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఫిబ్రవరి 28న ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్ముజ్‌ని మూసివేసింది. రుపక్షాల మధ్య ఏప్రిల్ 9న కాల్పుల విరమణ జరిగినప్పటికీ, ఈ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు మరియు దిగ్బంధం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనిలో ప్రయాణించడానికి గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు సైతం భయపడుతుంటే, భారతీయ నౌకలు మాత్రం సురక్షితంగా ప్రయాణిస్తూ దేశానికి అవసరమైన ఇంధన సరఫరాను అందిస్తున్నాయి. ఈ దౌత్య సీక్రెట్‌ను తాజాగా ఓడరేవుల మంత్రిత్వ శాఖ షిప్పింగ్ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ వెల్లడించారు.

ఈ హర్ముజ్‌లో భారత్‌ నౌకల ప్రయాణానికి ప్రధాన కారణం భారత విదేశాంగ శాఖ ఇరాన్‌తో అనునిత్యం దౌత్య చర్చలు జరపడేమన్నారు. అదే విధంగా ఏ నౌకలు ముందుగా ప్రయాణించాలనే ప్రాధాన్యతలను అనునిత్యం పర్యవేక్షించడం. దేశ ప్రయోజనాలకు అత్యవసరమైన చమురు, గ్యాస్, ఎరువుల నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా  అనునిత్యం ప్రణాళికలు వేస్తూ నౌకలు రవాణా జరిపేలా ప్రణాళికలు రచించామన్నారు. ప్రస్తుతం హర్ముజ్‌లో 13 భారత జెండా కలిగిన నౌకలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

కాగా యుద్ధ ‍ప్రారంభమైన నాటి నుంచి హర్ముజ్‌లో  అత్యధిక నౌకలను నడుపుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. ఇటీవలే శివాలిక్, నందాదేవి, జగ్ లాడ్కి, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బిడబ్ల్యూ టైర్, బిడబ్ల్యూ ఎల్మ్, గ్రీన్ సాన్వి వంటి నౌకలు ఈ జలసంధిని విజయవంతంగా దాటాయి. ప్రపంచ చమురు, సహజ వాయువు అవసరాలలో 20 శాతం ఈ ఇరుకైన హార్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. ఈ మార్గంలో రవాణా మందగించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగి ఆసియా దేశాలపై ఆర్థిక భారం పడుతున్న తరుణంలో, భారత్ తన వ్యూహాత్మక చతురతతో ఇంధన భద్రతను కాపాడుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement