breaking news
shipping ministry
-
గతిశక్తి ప్లాన్ కింద 101 ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద 101 ప్రాజెక్టులను గుర్తించినట్టు కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. వినియోగం, ఉత్పత్తి కేంద్రాలను పోర్ట్‌లతో అనుసంధానించేందుకు గతిశక్తి పథకాన్ని కేంద్రం తీసుకురావడం గమనించాలి. సీఐఐ వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా సోనోవాల్ మాట్లాడారు. 24 రాష్ట్రాల పరిధిలో 11 జలమార్గాలు విస్తరించాయని.. వీటిని జాతీయ జలమార్గాలుగా గుర్తించినట్టు తెలిపారు. ‘‘రవాణా వ్యయాలను తగ్గించడం భారత్‌కు కీలకం. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దృష్టితో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అనుసంధానం విస్తృతికి 101 ప్రాజెక్టులను మా శాఖ గుర్తించింది’’ అని సోనోవాల్ వివరించారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులైన సాగర్మాలా, భారత్‌మాలా, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అమలు దశల్లో ఉన్నట్టు చెప్పారు. సాగర్మాలా ప్రాజెక్టు కింద పోర్టుల సదుపాయాల విస్తరణకు, నైపుణ్యాల శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వాలకు తమ శాఖా తరఫున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఇతర పోర్ట్‌లతో అనుసంధానానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దేశంలో రవాణా సదుపాయాల విస్తరణ, రవాణా వ్యయాలు తగ్గించే లక్ష్యాలతో రూ.100 లక్షల కోట్ల నేషనల్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రధాని మోదీ ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రారంభించడం గమనార్హం. మౌలిక, రవాణా సదుపాయాలను విస్తరించడం ద్వారా భవిష్యత్తులో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్నది ఇందులోని ఉద్దేశ్యం. దేశ వాణిజ్యం, వృద్ధిలో సముద్రరంగం కీలక పాత్ర పోషిస్తుందని సోనోవాల్ అన్నారు. సరఫరా వ్యవస్థ, రవాణా సామర్థ్యాలు బలోపేతం అయితే 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం సాధ్యమవుతుందన్నారు. -
ప్రైవేటుకు జలమార్గాలపై పార్లమెంటరీ కమిటీ నో
న్యూఢిల్లీ: లాభదాయకమైన జాతీయ జలమార్గాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలన్న నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను పార్లమెంటరీ స్థాయీ సంఘం వ్యతిరేకించింది. నాలుగు, ఐదో జాతీయ జలమార్గాలను పీపీపీ పద్ధతిలో అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఈ మేరకు రవాణా, పర్యాటకం, సాంస్కృతిక అంశాలపై నియమితమైన పార్లమెంటరీ సంఘం పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. లాభదాయకమైన మార్గాలనే ప్రైవేటుకు అప్పగించాలన్న ఈ ప్రతిపాదనను సీతారాం ఏచూరి నేతృత్వంలోని కమిటీ ప్రశ్నించింది. కాగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిని కలుపుతూ గోదావరి, కృష్ణా నదులతోకూడిన మార్గాన్ని నాలు గో జాతీయ జలమార్గంగా, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ను కలుపుతూ ఉన్న మార్గా న్ని ఐదో జాతీయ జలమార్గంగా 2008లో ప్రకటించగా.. ఇంకా రవాణా కార్యకలాపాలు ప్రారంభం కాలేదు.