
అమెరికా-ఉక్రెయిన్ మధ్య రక్షణ సహకారం మరో మలుపు తిరిగింది. ఉక్రెయిన్‌కు పంపాల్సిన ఆయుధాలను తిరిగి అమెరికా డిఫెన్స్‌కు మళ్లించే ప్రక్రియ షురూ అయ్యింది. పెంటగాన్ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య త్వరలో జరగబోయే భేటీ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆసక్తిని రేపుతోంది.
గత నెలలో వాషింగ్టన్‌లోని రక్షణ శాఖలో వెలువడిన ఓ రహస్య మెమో బయటకు వచ్చింది. ఉక్రెయిన్‌కు వెళ్ళాల్సిన కొన్ని రకాల ఆయుధాలను తిరిగి అమెరికా రక్షణ నిల్వల్లోకి మళ్లించే నిర్ణయం తీసుకున్నట్లు ఈ మెమో వెల్లడించింది. ఎల్‌బ్రిడ్జ్ కొల్బీ, అమెరికా రక్షణ విధానాల ప్రధాన అధికారి ఈ మెమో పై సంతకం చేశారు.
ఈ నిర్ణయం అమలైతే… ఉక్రెయిన్ కోసం కేటాయించిన బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు అమెరికాలో డిఫెన్స్ నిల్వలను నింపడానికి ఉపయోగపడతాయి. ఉక్రెయిన్‌కు అధికంగా సాయం చేస్తే, అమెరికా వద్ద తక్షణ రక్షణ అవసరాల కోసం కీలకమైన సామగ్రి కొరత ఏర్పడుతుందన్నది పెంటగాన్ ఓ నివేదికలో పేర్కొంది.
వాటిలో ముఖ్యంగా ఇంటర్సెప్టర్ క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థలు, ఆర్టిలరీ గోళాలు ఉన్నాయి. గత నెలలో రక్షణ మంత్రి పీటె హేగ్‌సెత్, ఉక్రెయిన్‌కి పంపాల్సిన పెద్ద ఆయుధాల ప్యాకేజీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది కొల్బీ మెమో ప్రకారం తీసుకున్న నిర్ణయమే. కొల్బీ ఎప్పటినుంచో ఉక్రెయిన్‌కు అధిక ఆయుధ సహాయం ఇవ్వడంపై సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.

అయితే, ఈ నిర్ణయం బయటకు రాగానే అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకున్నారు. రష్యా దాడులు రోజువారీగా జరుగుతున్న వేళ, ఉక్రెయిన్‌కి రక్షణాత్మక ఆయుధాలను నిరంతరం అందిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అదే కాకుండా, నాటోతో కొత్త ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఉక్రెయిన్‌కి అవసరమైన ఆయుధాలను అమెరికా తయారు చేస్తుంది. వాటి ఖర్చు యూరోపియన్ మిత్రదేశాలు భరిస్తాయి. ఈ ప్రణాళిక విలువ బిలియన్ల డాలర్లు దాటే అవకాశం ఉండటంతో ఈ ఒప్పందం ఎలా అమలవుతుందనే దానిపై అనేక సందేహాలు నెలకొన్నాయి.