
అబుదాబి: ‘ఆపరేషన్ సింధూర్’(Operation Sindhur)తో ఉగ్రవాదంపై భారతదేశ దృఢ వైఖరి ప్రపంచం ముందు వ్యక్తమయ్యిందని, భారత్ చేపట్టిన ఈ మిషన్ ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత బలపరిచిందని బీజేపీ మహిళా నేత బన్సూరి స్వరాజ్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ‘ఆపరేషన్ సింధూర్’పై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం సాగిస్తోంది. దీనిలో భాగంగా శివసేన ఎంపీ శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఉన్నత స్థాయి అఖిలపక్ష ప్రతినిధి బృందం యూఏఈలో పర్యటిస్తోంది. ఈ బృందంలో భాగస్వామ్యురాలైన బీజేపీ మహిళా నేత బన్సూరి స్వరాజ్ యూఏఈలోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు.
తొలుత బన్సూరి.. భారత్- గల్ఫ్ దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదం(Terrorism)పై భారతదేశ దృఢమైన వైఖరి గురించి ఆమె మాట్లాడుతూ, భారత సాయుధ దళాల పరాక్రమంతో సాగిన ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు ఉగ్రవాదంపై పోరాటానికి పర్యాయపదంగా మారిందని అన్నారు. ఏప్రిల్ 22న భారతీయుల ఉనికిపై అనాగరిక దాడి జరిగిందని, దానికి భారత్ తగిన సమాధానం ఇచ్చిందని, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను తుదముట్టించిందని అన్నారు.
#WATCH | Abu Dhabi, UAE: BJP MP Bansuri Swaraj says, " Sindoor is now a synonym for justice and power. I salute our Armed Forces for this. I also appreciate the leadership of PM Modi..." pic.twitter.com/4wIAXF4M4b
— ANI (@ANI) May 22, 2025
పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచంతో కలసి పోరాడేందుకు బదులు దానిని తీవ్రతరం చేయాలని ప్రయత్నిస్తున్నదని బన్సూరి పేర్కొన్నారు. ఉగ్రదాడిపై ప్రతిస్పందన విషయంలో భారత్ అపారమైన సంయమనం, పరిణతితో వ్యవహరించిందని అన్నారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ తాము సాగిస్తున్న ఈ పర్యటన.. పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న తప్పుడు ప్రచారానికి ముగింపు పలుకుతుందని అన్నారు. సత్యాన్ని ఎంత అణచివేసినా, దానిని మటుమాయం చేయలేరని అన్నారు. యూఎఈ(UAE)లో భారత ప్రతినిధి బృందానికి శివసేన ఎంపి శ్రీకాంత్ షిండే నాయకత్వం వహిస్తున్నారు. అఖిలపక్ష ప్రతినిధి బృందంలో ఎంపీలు బన్సూరి స్వరాజ్, ఈటీ మొహమ్మద్ బషీర్, అతుల్ గార్గ్, సస్మిత్ పాత్ర, మనన్ కుమార్ మిశ్రా, బీజేపీ నేత సురేంద్రజీత్ సింగ్ అహ్లువాలియా, మాజీ రాయబారి సుజన్ చినోయ్ తదితరులున్నారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ ఆదేశాలు.. వారికి ‘హార్వర్డ్’లో నో అడ్మిషన్