గొర్రెల క్యాట్‌ వాక్‌ కేకో కేక

Sheeps Fashion Show Viral In Diyarbakir, Turkey - Sakshi

ర్యాంప్‌పై హొయలు ఒలుకుతూ.. వయ్యరంగా నడుస్తూ వస్తున్న గొర్రెలు ఔరా అనిపించాయి. అందంగా తయారైన గొర్రెలు మోడళ్లకు తీసికట్టు మాదిరి అందచందాలు ప్రదర్శిస్తూ క్యాట్‌ వాక్‌ చేశాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ దృశ్యం టర్కీలో కనిపించింది. గొర్రెల పెంపకంపై అవగాహన కల్పించేందుకు.. గొర్రెల రకాలు, వాటి మాంసం వివరాలు తెలుపుతూ ఈ ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ఈ షో టర్కీలోని దియాబకీర్‌ నగరంలో జరిగింది.

ఈ పోటీలో దాదాపు 12 గొర్రె జాతులు పాల్గొన్నాయి. ఆ గొర్రెలను యజమానులు అందంగా తయారు చేసి ర్యాంప్‌పై నడిపించారు. ఈ క్రమంలో స్టేజీపైకి వచ్చిన గొర్రెలు పెద్ద ఎత్తున జనాలు ఉండేసరికి గందరగోళ పడ్డాయి. యజమానులు వెంట నిల్చుని వాటిని నడిపించేందుకు అపసోపాలు పడ్డారు. ఒక్కో గొర్రె ఒక్కో రీతిన తయారై జ్యూరీ వారి దృష్టిని ఆకర్షించేలా వాటిని తయారుచేశారు. ఫ్యాషన్‌ షోల మాదిరి గొర్రెలకు నంబర్లు ఇచ్చి ర్యాంప్‌పై హొయలొలికిస్తూ అవి నడిచాయి. కళ్లజోడు ధరించి.. వింత హెయిర్‌ స్టైల్‌తో ఉన్న గొర్రె ఫైనల్‌ విజేతగా నిలిచింది. 

ఈ సందర్భంగా విజేతతో కలిసి అందరూ ఫొటోలు దిగారు. అనంతరం పోటీల పాల్గొన్న అన్ని గొర్రెలతో యజమానులు ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ ఫ్యాషన్‌ షోకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ సమయంలో నిర్వాహకులు కరోనా నిబంధనలు విధిగా పాటించారు. పోటీల్లో పాల్గొన్న వారందరూ మాస్క్‌ ధరించారు. పెద్దాచిన్న గొర్రెలు సందడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top