1.9 ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ

Senate approves budget to sideline GOP on Biden stimulus package - Sakshi

అమెరికా సెనేట్‌ ఆమోదం

నిర్ణయాత్మక ఓటు వేసిన కమలా హ్యారిస్‌

51–50 మెజారిటీతో కోవిడ్‌–19 ఎయిడ్‌ బిల్లు ఆమోదం

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి పంజా విసరడంతో అగ్రరాజ్యం అమెరికాలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యింది. వ్యాపారాలు దెబ్బతిన్నాయి, వాణిజ్యం పడకేసింది. నిరుద్యోగం బెంబేలెత్తిస్తోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పరుగులు పెట్టించాలని నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ సంకల్పించారు. ఏకంగా 1.9 ట్రిలియన్‌ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. సంబంధిత కోవిడ్‌–19 ఎయిడ్‌ బిల్లుకు అమెరికా సెనేట్‌ శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఆమోదం తెలిపింది. అంతకముందు రాత్రంతా ఈ ప్యాకేజీపై విస్తృత చర్చ జరిగింది. ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ సభ్యుల మద్దతు అవసరం లేకుండానే బిల్లు గట్టెక్కడం విశేషం.

ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ టై–బ్రేకింగ్‌ ఓటు వేశారు. సెనేట్‌లో ఆమె ఓటు వేయడం ఇదే తొలిసారి. దీంతో 51–50 మెజారిటీతో బిల్లు సునాయాసంగా ఆమోదం పొందినట్లు కమలా హ్యారిస్‌ ప్రకటించారు. దీంతో అధికార డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన సభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు. అలాగే సంబంధిత బిల్లులో పలు సవరణలకు అనుకూలంగా సెనేటర్లు ఓటు వేశారు. బిల్లు పరిధులను స్పష్టంగా నిర్వచించే సవరణ కూడా ఇందులో ఉంది.  సవరణలు చేసి, ఆమోదించిన కోవిడ్‌–19 ఎయిడ్‌ బిల్లును పార్లమెంట్‌కు పంపించారు. అక్కడ సులభంగానే ఆమోదం పొందనుంది. పార్లమెంట్‌లో ఆమోదం పొందితే బిల్లు చట్టరూపం దాల్చనుంది. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించే ప్రక్రియలో కీలకమైన ముందడుగు వేశామని సెనేట్‌ మెజారిటీ లీడర్‌ చుక్‌ షూమర్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.   
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top