రష్యా వ్యాక్సిన్‌ విడుదల రేపే?

Russia getting ready for mass vaccination against coronavirus - Sakshi

గమ్‌ కోవిడ్‌ వ్యాక్‌ లయో పేరుతో అభివృద్ధి

ప్రయోగాలు పూర్తయినట్లు వెల్లడి

ముందుగా వైద్యులు, ఉపాధ్యాయులకు టీకా

అక్టోబర్, నవంబర్‌లలో దేశమంతా కార్యక్రమం

జాగ్రత్త అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు కరోనా నియంత్రణకు ఓ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది! గమ్‌ కోవిడ్‌ వ్యాక్‌ లయో పేరుతో రష్యా తయారు చేసిన ఈ టీకాపై పలువురికి సందేహాలు ఉన్నప్పటికీ దాని వివరాలు ఒక్కటొక్కటిగా వెల్లడవుతున్నాయి. ముందుగా అనుకున్నట్టుగానే తాము ఆగస్టు 12న.. అంటే బుధవారం కరోనా టీకాను విడుదల చేస్తున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ నిర్ధారించింది.

దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ టీకాను ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ వారంలోనే వ్యాక్సిన్‌ను నమోదు చేసే ప్రక్రియ పూర్తవుతుందని ఆ శాఖ స్పష్టం చేసింది. ఆ తరువాత మూడు రోజులకు ఈ టీకా అందరికీ అందుబాటులోకి వచ్చినట్లే. రష్యాలోని గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖలు ఈ టీకా తయారు చేశాయి. టీకా వేసుకున్న తరువాత 21వ రోజుకు వైరస్‌ను అడ్డుకునేలా రోగనిరోధక వ్యవస్థ బలోపేతమైందని, రెండో డోస్‌తో ఇది రెట్టింపు సామర్థ్యం సంతరించుకుందని సమాచారం.  ఈ టీకాను అడినోవైరస్‌ భాగాలతో చేసినట్లుగా స్పుత్నిక్‌ వార్తా సంస్థ తెలిపింది.  (కరోనా సీజనల్‌ వైరస్‌ కాదు: డబ్ల్యూహెచ్‌వో)

వచ్చే నెల వాణిజ్య ఉత్పత్తి
రష్యా తయారు చేసిన టీకా నమోదు ఈ వారంలో జరగనుండగా.. వచ్చే నెలలో వాణిజ్యస్థాయి ఉత్పత్తి జరగనుంది. ముందుగా వైద్య సిబ్బందికి, ఉపాధ్యాయులకు టీకా ఇస్తామని, నవంబర్‌ నాటికి  అందరికీ టీకా అందుతుందని రష్యా ఆరోగ్య శాఖ  చెబుతోంది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ రష్యా టీకా ప్రకటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. సురక్షితమైన, సమర్థమైన టీకా అభివృద్ధికి తాము సూచించిన మార్గదర్శకాలను పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అమెరికాకు చెందిన కరోనా టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు డాక్టర్‌ ఆంథొనీ ఫాసీ.. ‘చైనా, రష్యా అందరికీ వ్యాక్సిన్‌ అందించే ముందు తగిన పరీక్షలు నిర్వహించాయనే ఆశిస్తున్నా’ అని  వ్యాఖ్యానించారు. (అక్క‌డ 100 రోజులుగా ఒక్క కేసు లేదు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top