
కీవ్/జపోరిజియా: ఉక్రెయిన్‌లో సైన్యానికి పాశ్చాత్య ఆయుధాలను చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న కీలక రేవు పట్టణం ఒడెసాపై రష్యా మంగళవారం భారీగా దాడులకు దిగింది. ఆయుధ సరఫరా మార్గాలను పూర్తిగా మూసేయడమే లక్ష్యంగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు మరణించారు. అత్యాధునిక కింజల్ హైపర్‌సోనిక్ క్షిపణులను కూడా ఒడెసాపైకి ప్రయోగించినట్టు ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ క్రమంలో రష్యా వద్ద కచ్చితత్వంతో దాడి చేసే క్షిపణుల నిల్వలు అడుగంటుతున్నాయని అమెరికా, ఇంగ్లండ్ అంచనా వేస్తున్నాయి.
ఇకనుంచి ఉక్రెయిన్‌పైకి కచ్చితత్వం అంతగా ఉండని పాత తరహా క్షిపణులు ప్రయోగించవచ్చని, తద్వారా పౌర నష్టం మరింత పెరగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్‌లో అతి పెద్ద నౌకాశ్రయమైన ఒడెసా ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగమతులకు ప్రధాన కేంద్రం. అది కొద్ది వారాలుగా రష్యా ముట్టడిలో ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరాలపై భారీ ప్రభావమే పడుతోంది. మరోవైపు మారియుపోల్‌లో అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటును చేజిక్కించుకునేందుకు రష్యా దళాలు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
అందులో ఇప్పటికీ 100 మంది దాకా పౌరులు చిక్కుబడ్డారని చెప్తున్నారు. తూర్పు ప్రాంతంలోని డోన్బాస్‌పైనే దృష్టి పెడతామని పుతిన్ ప్రకటించినా ఉక్రెయిన్‌లో వీలైనన్ని ప్రాంతాలను నల్లసముద్రం పై నుంచి క్షిపణులతో దాడి చేయడమే రష్యా లక్ష్యంగా పెట్టుకుందన్న భావన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా రసాయన పరిశ్రమలను రష్యా సైన్యం లక్ష్యంగా చేసుకోనుందని ఉక్రెయిన్ నిఘా వర్గాలు వెల్లడించాయి. దక్షిణ ఉక్రెయిన్‌లోనూ దాడులు బీభత్సంగా కొనసాగుతున్నాయి. ఖర్కీవ్‌కు 120 కిలోమీటర్ల దూరంలోని ఇజియుం నగరంపై మార్చిలో రష్యా దాడిలో నేలమట్టమైన భవన శిథిలాల నుంచి తాజాగా 44 మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. రష్యాకు పూర్తి మద్దతుగా నిలుస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పునరుద్ఘాటించారు. మరోవైపు రష్యాలో పుతిన్ మార్షల్ లా విధించే అవకాశముందని అమెరికా నిఘా చీఫ్ అభిప్రాయపడ్డారు.
కీవ్‌లో జర్మనీ విదేశాంగ మంత్రి
ఉక్రెయిన్‌కు సంఘీభావంగా దేశంలో పశ్చిమ దేశాల మంత్రులు, నేతల పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జర్మనీ విదేశాంగ మంత్రి అనలేనా బర్బోక్ కీవ్ శివారులోని బుచాలో మంగళవారం పర్యటించారు.
పుతిన్ ‘పరేడ్’ బోట్ ధ్వంసం
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత ఇష్టమైన రాప్టర్ శ్రేణికి చెందిన ‘పరేడ్’ బోట్‌ను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. స్నేక్ ద్వీపం సమీపంలో టీవీ2 డ్రోన్ ద్వారా లేజర్ గైడెడ్ బాంబులు వేసి దాన్ని సముద్రంలో ముంచేసినట్టు చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. తెలుపు రంగులో మెరిసిపోయే ఈ పరేడ్ బోట్ అంటే పుతిన్‌కు చాలా ఇష్టం. నావికా దళ పరేడ్‌లను ఈ బోట్‌లో నుంచే ఆయన తనిఖీ చేస్తుంటారు.