Russia Cuts Power to Finland: Russia Cuts Power Supple to Finland after NATO Announcement - Sakshi
Sakshi News home page

నాటో ఎఫెక్ట్‌: రష్యాకు మొదటి దెబ్బ.. ఫరక్‌ పడదన్న ఫిన్లాండ్‌

Published Sat, May 14 2022 3:14 PM

Russia Cut Power Supply To Finaland After Nato Announcement - Sakshi

నాటోలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్న ఫిన్లాండ్‌కు రష్యా మొదటి దెబ్బ రుచి చూపించింది. ఫిన్లాండ్‌కు రష్యా సరఫరా చేసే విద్యుత్తును శనివారం నుంచి నిలిపివేసింది. ఈ విషయాన్ని ఫిన్నిష్(ఫిన్లాండ్‌) ఆపరేటర్ ఒకరు ధృవీకరించారు.

నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో చేరేందుకు ఫిన్లాండ్‌ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆలస్యం చేయకుండా తమకు సభ్యత్వం ఇవ్వాలంటూ నాటోకు విజ్ఞప్తి చేసింది ఫిన్లాండ్‌. ఈ పరిణామం రష్యాకు మంట పుట్టించింది. దీన్నొక ‘బెదిరింపు’ చర్యగా అభివర్ణిస్తూనే.. తర్వాతి పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది కూడా. 

ఈ మేరకు మే 14 నుంచి(శనివారం) విద్యుత్‌ సరఫరాను ఫిన్లాండ్‌కు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రష్యా  విద్యుత్‌ సరఫరాదారు కంపెనీ రావో నోర్డిక్‌ మాత్రం చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంతోనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే చెల్లింపుల వ్యవహారంపై స్పష్టత ఏంటన్నది ఇటు రావో నోర్డిక్‌ కంపెనీగానీ, అటు ఫిన్‌గ్రిడ్‌ మాత్రం వెల్లడించలేదు.

ఫరక్‌ పడదు
ఇరవై ఏళ్ల ఇరు దేశాల వర్తక వాణిజ్యంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే.. విద్యుత్‌ సరఫరా నిలిపివేతపై ఫిన్లాండ్‌ స్పందించింది. రష్యా విద్యుత్‌ సరఫరా నిలిపివేసినంత మాత్రాన ఫరక్‌ పడదని ప్రకటించుకుంది. సరఫరా చేసుకునేది కొద్ది శాతమే కాబట్టి ఇబ్బంది ఏం ఉండబోదని ఫిన్నిష్‌ గ్రిడ్‌ ఆపరేటర్‌ ప్రకటించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి ఫిన్లాండ్‌కు సరఫరా అయ్యేది పది శాతం విద్యుత్‌ మాత్రమే. ఆ లోటును స్వీడన్‌ నుంచి దిగుమతి చేయడమో లేదంటే సొంతంగా ఉత్పత్తి చేసుకోవడమో చేస్తామని ఫిన్లాండ్‌ ప్రకటించుకుంది. కానీ, రష్యా విద్యుత్‌ చౌకదనంతో పోలిస్తే.. ఫిన్లాండ్‌ భరించాల్సిన ఖర్చు ఎక్కువే కానుంది. 

ఇదిలా ఉంటే.. రష్యా ఫిన్లాండ్‌తో 1,300 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటోంది. నాటోలో చేరాలని ఫిన్లాండ్‌కు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. కేవలం రష్యా బెదిరింపుల మేరకు వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఉక్రెయిన్‌ పరిణామాల నేపథ్యం, ప్రజా ఒత్తిడి నేపథ్యంలో నాటో సభ్యత్వం కోసం అధికారికంగా ఒక ప్రకటన చేసింది.

చదవండి👉🏼: ఉక్రెయిన్‌ యుద్ధం.. భారత్‌ కీలక నిర్ణయం

Advertisement
Advertisement