‘ఇవే మా లక్ష్యాలు.. పవర్‌ఫుల్‌ స్పీచ్‌లో ట్రంప్‌ చెప్పారు’ | Rubio says Trump’s ‘powerful speech’ made US objectives clear | Sakshi
Sakshi News home page

‘ఇవే మా లక్ష్యాలు.. పవర్‌ఫుల్‌ స్పీచ్‌లో ట్రంప్‌ చెప్పారు’

Apr 2 2026 9:05 AM | Updated on Apr 2 2026 11:20 AM

Rubio says Trump’s ‘powerful speech’ made US objectives clear

వాషింగ్టన్‌: ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇచ్చిన పవర్‌ఫుల్‌ స్పీచ్‌ తమ దేశ లక్ష్యాలను స్పష్టంగా తెలిపిందని యూఎస్‌ విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఆ లక్ష్యాలు.. ‘ఇరాన్‌ ఆయుధ తయారీ కర్మాగారాలను నాశనం చేయడం, వారి నౌకాదళాన్ని నాశనం చేయడం, వారి వైమానిక దళాన్ని నాశనం చేయడం, ఆ దేశం ఎప్పటికీ అణ‍్వాయుధాలు అభివృద్ధి చేసుకోకుండా అవకాశాలను నాశనం చేయడం’ అని అన్నారు.

“మా అధ్యక్షుడి నాయకత్వం ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపుతోంది. అదే.. అమెరికా తన ప్రజలను, తన ప్రయోజనాలను రక్షించుకుంటుంది. అమెరికా తన శక్తి ద్వారా శాంతి కొనసాగేలా చేస్తుంది” అని రుబియో పేర్కొన్నారు.

కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఇరాన్‌తో చేసుకున్న ఒప్పందం అమలులో ఉంటే ఇజ్రాయెల్‌ నామరూపాలు లేకుండాపోయేదని ట్రంప్‌ చెప్పిన విషయం తెలిసిందే. 1.7 బిలియన్‌ డాలర్లను గత అధ్యక్షుడు ఒబామా ఇరాన్‌కు ఇచ్చారని తెలిపారు. ఇరాన్‌ వద్ద ఇంకా అణ్వాయుధ సంపద ఉందని, ఆ దేశాన్ని అణ్వాయుధ దేశంగా మారనివ్వనని అన్నారు. ఇరాన్‌ అణ్వాయుధ సంపదను తుడిచిపెట్టడమే తన లక్ష్యమని చెప్పారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ఇచ్చిన స్పీచ్‌ను స్వయంగా వినడానికి పలువురు ప్రముఖులు రావడం గమనార్హం. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ తో పాటు విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, పలువురు ఉన్నతస్థాయి సైనికాధికారులు వచ్చారు. ట్రంప్‌ స్పీచ్‌ను ప్రపంచం ఆసక్తికరంగా విన్నది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న దానిపై మాత్రం ట్రంప్‌ స్పష్టత ఇవ్వలేదు. మరో రెండు-మూడు వారాలు దాడులు కొనసాగుతాయని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement