
2024లో సైబర్ నేరస్తులు దోచిన మొత్తం ఇదీ
ఏడాదిలో ఏకంగా మూడింతలు పెరిగిన నష్టం
రికార్డు స్థాయిలో 36 లక్షలకుపైగా ఫిర్యాదులు
10 వేల మందికిపైగా సైబర్ నేరస్తుల అరెస్ట్
భారత్‌లో ఇంటర్నెట్ మారుమూల పల్లెలకూ చేరింది. డిజిటల్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఈ అంశమే ఇప్పుడు సైబర్ నేరస్తులకు ఆయుధంగా మారింది. దీంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం సైబర్ నేరగాళ్లు 2024లో భారతీయుల నుంచి రూ.22,845.73 కోట్లు కొల్లగొట్టారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో ఆర్థిక సంబంధమైన ఫిర్యాదులు 24.42 లక్షలు వస్తే.. 2024లో ఈ సంఖ్య ఏకంగా 36.36 లక్షలకు పెరిగింది.
ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు, బ్యాంకులు, పోలీసు విభాగాలు చేపడుతున్న అవగాహన కార్యక్రమాల పుణ్యమా అని జనంలో సైబర్ నేరాలపట్ల అవగాహన పెరిగినా నేరాలు తగ్గకపోవడం గమనార్హం. సైబర్ మోసాలే కాదు.. బాధితులు పోగొట్టుకుంటున్న మొత్తమూ ఏటా అంచనాలకు మించి నమోదవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు బాధితులు నష్టం జరిగిపోయాక.. పోలీసు స్టేషన్లు, సైబర్ పోలీస్ స్టేషన్లు, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టళ్లు, టోల్ ఫ్రీ నంబర్ల వంటివాటిని ఆశ్రయిస్తున్నారు. –సాక్షి, స్పెషల్ డెస్క్
లొకేషన్ ఇట్టే పట్టేస్తారు
సైబర్ భద్రతా ప్రయత్నాలకు అనుగుణంగా పోలీసుల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం 9.42 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 2,63,348 ఐఎంఈఐలను బ్లాక్ చేసింది. నేరస్తులు ఉన్న చోటు, వారి కేంద్రాలను గుర్తించి నిఘా వ్యవస్థలకు సమాచారం చేరవేసేందుకు ’ప్రతిబింబ్’ మాడ్యూల్‌ను కూడా ఏర్పాటుచేసింది. ఈ మాడ్యూల్ ద్వారా 10,599 మంది నిందితులను అరెస్టు చేయగలిగారు. తద్వారా 26,096 మంది నేరస్తులను గుర్తించగలిగారు. 63,019 సైబర్ దర్యాప్తు సహాయ అభ్యర్థనలను ప్రాసెస్ చేయగలిగారు.
కట్టడికి కలిసికట్టుగా..
న్యూఢిల్లీలోని ఇండియన్ సైబర్‌క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) కేంద్రంగా సైబర్ నేరాల నియంత్రణ కేంద్రాన్ని (సీఎఫ్‌ఎంసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్న విభిన్న విభాగాలు.. సైబర్ నేరం జరిగినట్టు ఫిర్యాదు అందగానే వెంటనే స్పందించి ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు, అలాగే నేరస్తులను పట్టుకునేందుకు కలిసికట్టుగా నిరంతరం శ్రమిస్తున్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం సమాచారం, డేటా, కమ్యూనికేషన్ లింక్‌ను నేరస్తులు వాడకుండా నిరోధించేందుకు.. ఐటీ సేవల కంపెనీలకు సమాచారం ఇచ్చేందుకు ‘సహ్యోగ్’ పోర్టల్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.
ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టే దిశగా టెలికం శాఖ (డాట్) రూపొందించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్‌ఐఆర్) ప్లాట్‌ఫాంను ఉపయోగించుకోవాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించింది. మధ్యస్థ, అధిక, అత్యధిక ఆర్థిక మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను ఇది రియల్ టైమ్‌లో వర్గీకరిస్తుంది. ప్రస్తుతం చెల్లింపులకు యూపీఐ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా కోట్ల మందిని ఈ సాంకేతికత కాపాడగలదని తెలిపింది.
సైబర్ మోసాల వల్ల భారతీయులు గత ఏడాది రూ.22,845.73 కోట్లు కోల్పోయారు. 2023లో ఈ మొత్తం రూ.7,465.18 కోట్లు.
2024లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో (ఎన్ సీఆర్‌పీ) 19.18 లక్షలు, సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్) ద్వారా 17.18 లక్షల ఫిర్యాదులు.. మొత్తంగా 36.36 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ రెండు వేదికలు 2023లో అందుకున్న ఫిర్యాదుల సంఖ్య 24.42 లక్షలు.
రూ.10 వేల కోట్లకుపైగా కాపాడారు!
కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్) ద్వారా వచ్చిన 17.8 లక్షల ఫిర్యాదులకుగాను రూ.5,489 కోట్లకు పైగా డబ్బును ప్రజలు కోల్పోకుండా కాపాడగలిగారు. బ్యాంకుల నుంచి 11 లక్షలకు పైగా అనుమానిత సైబర్ నేరస్తుల రికార్డులు అందాయి. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును దాచిన 24 లక్షల లేయర్–1 మ్యూల్ ఖాతాల వివరాలను సస్పెక్ట్ రిజిస్ట్రీ ద్వారా నిఘా సంస్థలకు చేరాయి. తద్వారా రూ.4,631 కోట్లకు పైగా విలువైన మోసాలను నిరోధించగలిగారు.