
భారతీయుల నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తం
ఓటీపీ, డిజిటల్ స్కాం, క్రిప్టో కరెన్సీ, ఆన్‌లైన్ ఫ్రాడ్‌లతో స్వాహా
సాక్షి, న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవలం 5 నెలల వ్యవధిలో అక్షరాలా రూ.7వేల కోట్లను దేశ ప్రజల నుంచి కొట్టేశారు. దీనిని బట్టి చూస్తే మే– జూలై మధ్యలో సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తం రూ.10వేల కోట్ల వరకు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీపీ ఫ్రాడ్ మొదలు డిజిటల్ స్కాం వరకు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా మోసం చేస్తున్న నేరగాళ్లు లక్షల రూపాయిలు కొల్లగొడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేరాలు చేసే వారంతా ఆగ్నేయాసియా దేశాల వాళ్లు కాగా చేయించేది మాత్రం చైనీయులేనని నిఘా విభాగం స్పష్టం చేసింది.
ఐ4సీ ఏం చెబుతోందంటే..
దేశ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వివిధ దేశాలకు చెందిన సైబర్ నేరాలకు వివిధ దేశాలకు చెందిన వారు పాల్పడుతున్నారని హోంశాఖ గుర్తించింది. వివిధ మార్గాల్లో డబ్బు కొట్టేస్తున్న వాళ్లంతా మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌లకు చెందిన వారేనని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) డేటా తేలి్చంది. వీరి వెనుక ఉన్నది మాత్రం చైనీయులేననేది ఐ4సీ స్పష్టం చేస్తోంది. నెలకు రూ. వెయ్యి కోట్ల వసూళ్లే లక్ష్యంగా వీరు అమాయకులను ఉచ్చులోకి దించుతున్నట్లు తెలిపింది.
డబ్బంతా వెళ్లేది అటే..
సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్) డేటా ప్రకారం దేశంలో జనం నుంచి కొట్టేసిన డబ్బంతా ఆగ్నేయాసియా దేశాలకు వెళుతున్నట్లు వెల్లడైంది. జనవరిలో రూ.1,192 కోట్లు, ఫిబ్రవరిలో రూ.951 కోట్లు, మార్చిలో రూ.1,000 కోట్లు, ఏప్రిల్‌లో రూ.731 కోట్లు, మేలో రూ.999 కోట్లు కొట్టేసినట్లు సమాచారం. ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ స్కాం, పోలీసులమని చెప్పి కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడటం, క్రిప్టో కరెన్సీ, లాటరీ స్కాం, క్రెడిట్ కార్డు పాయింట్స్ క్లెయిం, ఈ నెంబర్‌పై ఆఫర్ ఉంది కారు గిఫ్ట్‌గా వస్తుందని చెప్పడం, పెళ్లి చేసుకోవడానికి యూఎస్ నుంచి వస్తున్నట్లు నమ్మబలకడం, లింకులు పంపి డబ్బు కొట్టేయడం తదితర మార్గాల్లో జనం నుంచి లాగేస్తున్నారు.
మన వాళ్లే ఏజెంట్లు
సైబర్ నేరాల పేరుతో అమాయకుల నుంచి డబ్బు కొట్టేసేందుకు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మనవాళ్లను ఏజెంట్లుగా నియమించుకోవడం గమనార్హం. ఇటీవల ఈ విషయాలు వివిధ రాష్ట్రాల పోలీసుల దర్యాప్తులు తేలాయి. మహారాష్ట్ర, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వందల కొద్దీ ఏజెంట్లు సైబర్ నేరగాళ్ల సహకరిస్తున్నారు. చైనా నుంచి కీలక వ్యక్తుల సూచనలు.. మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌లకు దేశాల నేరగాళ్ల ఆదేశాలతో మనవాళ్లు నేరాల్లో ప్రత్యక్షంగా భాగస్వాములుగా మారుతున్నట్లు గుర్తించారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, వీరి ఉచ్చులో పడొద్దని కేంద్రం పదేపదే హెచ్చరిస్తున్నా కేటుగాళ్లఉచ్చులో జనం పడుతుండటం గమనార్హం.