దేశాన్ని కబళిస్తున్న బీజేపీ

Rahul Gandhi Lectures On Ideas For India In UK  - Sakshi

మీడియాను, వ్యవస్థలను గుప్పిట్లో ఉంచుకుంది

లండన్‌లో జరిగిన కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు

ప్రాంతీయ పార్టీలతో కలిసి ఉద్యమిస్తామన్న కాంగ్రెస్‌ నేత

రాహుల్‌ దేశ ద్రోహి అంటూ కాషాయ దళం ఎదురుదాడి

న్యూఢిల్లీ: బీజేపీ పాలనపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశాన్ని కాషాయ పార్టీ పొరుగునున్న పాకిస్తాన్‌ మాదిరిగా మార్చేసిందని, దేశం ఆత్మను కబళిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలను తమ పార్టీ గౌరవిస్తుందని, వారిని కలుపుకుని బీజేపీ పాలనపై పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. బ్రిడ్జి ఇండియా అనే ఎన్జీవో ‘ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’ అంశంపై శుక్రవారం లండన్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘దేశం ఆత్మపై బీజేపీ దాడి చేస్తోంది. దేశ గళం నొక్కుతోంది. గళం లేని ఆత్మ ఉన్నా లేనట్లే. తెరవెనుకన ఉంటూ సీబీఐ, ఈడీలను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకుంది. సమాచార వ్యవస్థను నియంత్రిస్తోంది. దేశాన్ని నమిలి మింగేస్తోంది. పొరుగునున్న పాకిస్తాన్‌లో జరుగుతున్నదీ ఇదే’అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరి, తేజస్వీ యాదవ్‌ తదితర నేతలు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.  

‘దేశంలోని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మౌలిక వనరులను అన్నీ ఒకే ఒక్క కంపెనీ నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ప్రైవేట్‌ రంగం గుత్తాధిపత్యం ఇంత ప్రమాదకర స్థాయిలో ఎన్నడూ లేదు. బీజేపీ దేశమంతటా కిరోసిన్‌ను చల్లింది. ఒక్క నిప్పు రవ్వ అంటుకుంటే చాలు. పెద్ద సమస్యలో చిక్కుకుపోతాం. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమిస్తుంది’అని రాహుల్‌ తెలిపారు. ‘ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌ సమానంగా గౌరవిస్తుంది. పెదనాన్న పాత్ర పోషించాలనుకోవడం లేదు. ఆ పార్టీల కంటే కాంగ్రెస్‌ ఏవిధంగానూ ఎక్కువ కాదు. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తాం, విస్తృతంగా ప్రజల వద్దకు వెళ్తాం’అని చెప్పారు.  

నా వ్యాఖ్యలను వక్రీకరించారు
ఒక సిద్ధాంత మంటూ లేని ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో బీజేపీతో పోరాడలేవంటూ ఇటీవల ఉదయ్‌పూర్‌ చింతన్‌ బైఠక్‌ సమయంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీల్లో అసహనం రేపాయి. ఈ విషయాన్ని రాహుల్‌ తాజాగా ప్రస్తావించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆయన.. ‘జాతీయ స్థాయిలో కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య సైద్ధాంతిక పోరు జరుగుతోంది. ఎవరి సిద్ధాంతాలు వారివి. ఒక తమిళ రాజకీయ పార్టీగా డీఎంకేను గౌరవిస్తాం. కానీ, సిద్ధాంతిక ప్రాతిపదికగా జాతీయ స్థాయిలో పోరాడే  వ్యవస్థాపక నిర్మాణం కాంగ్రెస్‌కు ఉంది’ అని తెలిపారు. రష్యా– ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఆయన దేశ సరిహద్దుల్లోని లద్దాఖ్‌లో చైనా దుందుడుకు చర్యలతో పోల్చారు. ‘భారత విదేశాంగ శాఖ అధికారులు పూర్తిగా మారిపోయారు. అహంకారం పూరితంగా ఎవరినీ పట్టించుకోవడం లేదు. ఎవరి మాటా వినడం లేదు’అని యూరప్‌కు చెందిన కొందరు ప్రభుత్వాధికారులు తనకు చెప్పారన్నారు.

భారత్‌ ఎప్పటికీ గొప్పదేశమే: రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయన పార్ట్‌టైం, పరిపక్వత లేని, విఫల నేత అంటూ అభివర్ణించింది. విదేశీ గడ్డపై ఉండి పదేపదే ఇటువంటి విమర్శలతో దేశానికి ద్రోహం చేస్తున్నారని బీజేపీ ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఆరోపించారు. ‘1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లకు ఆజ్యం పోసింది కాంగ్రెస్‌ పార్టీయే. రష్యా– ఉక్రెయిన్‌ సంక్షోభంతో లద్దాఖ్‌లో పరిస్థితులను పోల్చడం గాల్వన్‌లో దేశ సైనికుల త్యాగాల్ని అవమానించడమే. ప్రతిపక్షంలో ఉండటమంటే దేశ ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సగం కాలం సైనిక పాలనలోనే ఉన్న పాకిస్తాన్‌ మనుగడ కోసం ఇతర దేశాలను బిచ్చమెత్తుకుంటోంది. అటువంటి దేశంతో భారత్‌ను పోల్చడం తగదు. భారత్‌ ఇప్పటికీ, ఎప్పటికీ గొప్ప దేశమే’అని  పేర్కొన్నారు.

దేశ ప్రయోజనాల కోసమే
దేశ విదేశాంగ శాఖ అధికారులపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలకు విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. ‘అవును, జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే విదేశాంగ విధానాలను మార్చాం. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు అమలు పరుస్తారు. ఇతరుల వాదనలకు దీటుగా బదులిస్తారు. ప్రభుత్వ ఆత్మవిశ్వాసానికి ఇది నిదర్శనమే తప్ప అహంకారం కాదు’అని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top