
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’(Operation Sindhur)పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా రష్యన్ అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్- అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌లో భారత్- పాక్ మధ్య జరుగుతున్న వివాదంతో పాటు ప్రపంచ సమస్యలపై చర్చించారని రష్యా అధికారిక కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉషాకోవ్ తెలిపారు.
ట్రంప్, పుతిన్‌ల చర్చల్లో మిడిల్ ఈస్ట్‌తో పాటు భారత్-పాక్ మధ్య జరుగుతున్న సాయుధ సంఘర్షణపై ప్రస్తావనకు వచ్చింది. అయితే అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత జోక్యంతో దీనిపై చర్చ ఆగిపోయింది. అని ఉషాకోవ్ రష్యన్ వార్తా సంస్థ ‘టాస్’కు తెలిపారు. ఆయన ఈ చర్చలపై పూర్తి వివరాలను వెల్లడించలేదు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మే 7న పాక్‌తో పాటు ఉగ్రవాద శిబిరాలకు ఆతిథ్యం ఇస్తున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని సరిహద్దు వెంబడి భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. దీంతో పాకిస్తాన్ వెనక్కు తగ్గింది. మే 10న భారత్-పాక్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించాయి.
ఈ నేపధ్యంలో పుతిన్(Putin)- ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో భారత్-పాక్ వివాదంపై చర్చ జరగగా, ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ట్రూత్’ తో తమ సంభాషణలోని వివరాలను వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ అణు కార్యక్రమం తదితర ప్రపంచ విషయాలపై తాము మాట్లాడుకున్నామని ట్రంప్ తెలిపారు. తమ మధ్య వివిధ అంశాలపై దాదాపు గంటా 15 నిమిషాల పాటు చర్చ కొనసాగిందని, అయితే ఇది తక్షణ శాంతికి దారితీసే సంభాషణ కాదని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా అణు ప్రతిపాదనకు ఇరాన్ విముఖత
అమెరికా రూపొందించిన ముసాయిదా అణు ప్రతిపాదన(Draft nuclear proposal)ను ఇరాన్ తిరస్కరించింది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మీడియాతో మాట్లాడుతూ అమెరికా కోరుకుంటున్నట్లు టెహ్రాన్ తన యురేనియం సమృద్ధిని ఎన్నటికీ వదులుకోదని స్పష్టం చేశారు. అమెరికా కొత్త అణు ఒప్పంద ప్రతిపాదన తమ ప్రయోజనాలకు అనుగుణంగా లేదని ఇరాన్ పేర్కొంది.
ఇరాన్ తమ యురేనియం సమృద్ధిని కొనసాగిస్తామని పట్టుబడుతుండగా, అమెరికా దానిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇటీవల అణు ఒప్పందం కోసం కొత్త ప్రతిపాదనను ఇరాన్‌తో పంచుకున్నామని అమెరికా తెలుపగా, దానిని ఇరాన్ ధృవీకరించింది. దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్.. ఇరాన్‌కు ఆమోదయోగ్యమైన అణు ప్రతిపాదనను పంపారని, దానిని అంగీకరిస్తే, ఇరాన్‌కు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. లేని పక్షంలో అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా పునరుద్ఘాటించినట్లుగా ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందని లీవిట్ పేర్కొన్నారు.
గతంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఒక పోస్ట్‌లో.. తమ జాతీయ ప్రయోజనాలు, హక్కులకు అనుగుణంగా ఉంటేనే అమెరికా ప్రతిపాదనపై ఇరాన్ ప్రతిస్పందిస్తుందన్నారు. కాగా అమెరికా అణు సంస్థ నివేదిక ప్రకారం ఇరాన్ తన దేశంలోని మూడు ప్రదేశాలలో రహస్య అణు కార్యకలాపాలను నిర్వహించింది. మరోవైపు ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు ఆయతుల్లా రుహోల్లా ఖొమేనీ ఇటీవల అమెరికా అణు ఒప్పందం 1979 నాటి ఇస్లామిక్ విప్లవ భావజాలానికి వందశాతం వ్యతిరేకంగా ఉన్నదని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: ‘తత్కాల్’ స్కాంకు చెక్.. 2.5 కోట్ల నకిలీ యూజర్ ఐడీలు డియాక్టివేట్