ట్రంప్ షేర్ లావాదేవీల కలకలం.. వైట్‌హౌస్‌ను కుదిపేస్తున్న వివాదం | President or Day Trader Trumps 3700 Trades Spark Uproar | Sakshi
Sakshi News home page

ట్రంప్ షేర్ లావాదేవీల కలకలం.. వైట్‌హౌస్‌ను కుదిపేస్తున్న వివాదం

May 21 2026 9:43 PM | Updated on May 22 2026 8:06 AM

President or Day Trader Trumps 3700 Trades Spark Uproar

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారీ వివాదంలో చిక్కుకున్నారు. రోజుకు రెండు, మూడు సార్లు షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే సాధారణ ఇన్వెస్టర్లకంటే భిన్నంగా, ట్రంప్ వైట్‌హౌస్‌లో కూర్చొని రోజుకు సగటున 40 సార్లు ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు అమెరికా రాజకీయ, ఆర్థిక వర్గాలను కుదిపేస్తున్నాయి. కేవలం 90 రోజుల్లోనే 3,700కు పైగా షేర్ లావాదేవీలు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Bloomberg నివేదికల ప్రకారం, 2026 జనవరి నుంచి మార్చి మధ్య ట్రంప్ లేదా ఆయన సలహాదారులు భారీ స్థాయిలో షేర్ల కొనుగోలు, అమ్మకాల లావాదేవీలు నిర్వహించారు. ముఖ్యంగా Microsoft, NVIDIA, Oracle, Boeing, Amazon, Meta వంటి దిగ్గజ కంపెనీల్లో కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్క ఫిబ్రవరి 10న మాత్రమే మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ షేర్లను 5 మిలియన్ నుంచి 25 మిలియన్ డాలర్ల వరకు అమ్మినట్లు సమాచారం.

అధ్యక్షుడా? హెడ్జ్ ఫండ్ బాసా? 
ఈ స్థాయి ట్రేడింగ్ చూసి వాల్ స్ట్రీట్ నిపుణులే ఆశ్చర్యానికి గురయ్యారు. అమెరికా ప్రభుత్వ నైతిక ప్రమాణాల కార్యాలయానికి సమర్పించిన వందల పేజీల ఆర్థిక వివరాలు ఈ వ్యవహారాన్ని బయటపెట్టాయి. పలువురు మార్కెట్ నిపుణులు ఇది సాధారణ వ్యక్తిగత పెట్టుబడి ఖాతా లాగా కనిపించడం లేదని, భారీ అల్గోరిథమిక్ ట్రేడింగ్ నిర్వహించే హెడ్జ్ ఫండ్ తరహాలో ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే అసలు వివాదం ఇక్కడి నుంచే మొదలైంది. ఒక దేశాధ్యక్షుడు ప్రభుత్వ విధానాలతో నేరుగా ప్రభావితమయ్యే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్న ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉదాహరణకు NVIDIA సంస్థ చైనాకు ఏఐ చిప్‌లు ఎగుమతి చేయాలంటే అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 

అలాగే బోయింగ్ కంపెనీ ప్రభుత్వ రక్షణ ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి కంపెనీలపై ప్రభుత్వం యాంటీ ట్రస్ట్ విచారణలు, ఏఐ నియంత్రణలపై నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒకవైపు ప్రభుత్వ విధానాలు రూపొందిస్తూ, మరోవైపు అదే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం “కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్” కిందికి వస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గత అమెరికా అధ్యక్షులు George H. W. Bush, Bill Clinton తమ ఆస్తులను “బ్లైండ్ ట్రస్ట్”లలో ఉంచి ఇలాంటి ఆరోపణలకు తావివ్వకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ట్రంప్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ సంస్థల నిర్వహణలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కొనసాగుతోందని, కొన్ని ఆర్థిక దాఖలాల్లో ఆలస్యానికి జరిమానాలు కూడా చెల్లించారని సమాచారం.

ఆటోమేటెడ్ అల్గోరిథమ్స్ ద్వారా జరిగిందా? 
ఇంత భారీ స్థాయిలో ట్రేడింగ్ సాధ్యమా? లేదంటే ఆటోమేటెడ్ అల్గోరిథమ్స్ ద్వారా జరిగిందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఇది పూర్తిగా అల్గోరిథమిక్ ట్రేడింగ్ అని నిరూపించే ఆధారాలు లేవని తెలుస్తోంది. అయినప్పటికీ, కేవలం మూడు నెలల్లో వేల లావాదేవీలు జరగడం అమెరికా మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

ఈ వివాదానికి మరింత ఊపిరి పోసింది ఇరాన్ అంశం. ఇరాన్‌తో చర్చలు పురోగమిస్తున్నాయని ట్రంప్ ప్రకటించే ముందు కొందరు ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో ఫ్యూచర్స్ మార్కెట్‌లో బెట్టింగ్ పెట్టారని సమాచారం. ట్రంప్ ప్రకటన తర్వాత చమురు ధరలు పడిపోగా, అమెరికా మార్కెట్లు భారీగా ఎగిశాయి. ఈ టైమింగ్ అనుమానాలకు తావిచ్చినా, ట్రంప్‌కు నేరుగా సంబంధం ఉందని నిరూపించే ఆధారాలు లేవు.

ఇదిలా ఉండగా ట్రంప్ అల్లుడు Jared Kushner పేరు కూడా ఈ చర్చల్లో వినిపిస్తోంది. మధ్యప్రాచ్య దేశాలతో దౌత్య చర్చలు జరుపుతూనే, గల్ఫ్ పెట్టుబడిదారులతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన సంస్థ Affinity Partners సౌదీ అరేబియా సహా గల్ఫ్ సంపద నిధులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

అయితే వైట్ హౌస్ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. ట్రంప్ పెట్టుబడులను స్వతంత్ర ఆర్థిక సంస్థలే నిర్వహిస్తున్నాయని, ఆయన గానీ, కుటుంబ సభ్యులు గానీ నేరుగా ట్రేడింగ్‌లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఒక అమెరికా అధ్యక్షుడు ప్రభుత్వ నిర్ణయాలతో ప్రభావితమయ్యే కంపెనీల్లో ఈ స్థాయిలో దూకుడుగా ట్రేడింగ్ చేయడం నైతికంగా సరైనదేనా? అన్న ప్రశ్న మాత్రం అమెరికాలో పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తోంది.  - వెబ్‌ డెస్క్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement