
భారత్–జపాన్ సంబంధాల్లో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం
కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం పదేళ్ల రోడ్‌మ్యాప్ సిద్ధం
‘జపాన్ టెక్నాలజీ, ఇండియన్ టాలెంట్ విన్నింగ్ కాంబినేషన్’
చంద్రయాన్–5 మిషన్‌లో జపాన్ భాగస్వామ్యం
ప్రధాని మోదీ స్పషీ్టకరణ
జపాన్ ప్రధాని షిగెరుతో భేటీ
పదేళ్లలో భారత్‌లో రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న జపాన్
టోక్యో: భారత్–జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో నూతన, సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ సహా వివిధ కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం పదేళ్ల రోడ్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జపాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం జపాన్‌కు చేరుకున్నారు.
రాజధాని టోక్యోలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అదృష్టానికి, శుభానికి సంకేతంగా భావించే జపాన్ సంప్రదాయ దారూమా బొమ్మను బౌద్ధ మత గురువులు బహూకరించారు. అనంతరం జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబాతో మోదీ సమావేశమయ్యారు. భారత్–జపాన్ సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. సెమీకండక్టర్ల నుంచి అరుదైన ఖనిజాల సరఫరా దాకా.. కీలక రంగాల్లో సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నారు. మానవ వనరుల అభివృద్ధి, సాంస్కృతిక సంబంధాలపైనా చర్చ జరిగింది. సుస్థిర ఇంధన కార్యక్రమం, బ్యాటరీ సరఫరా వ్యవస్థ భాగస్వామ్యం, ఆర్థిక భద్రత–సహకార కార్యక్రమాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘జపాన్ టెక్నాలజీ, ఇండియన్ టాలెంట్ విన్నింగ్ కాంబినేషన్’ అని మోదీ ఉద్ఘాటించారు. రెండూ పూర్తిస్థాయిలో ఒక్కటైతే ఇక తిరుగుండదని తేలి్చచెప్పారు. భౌగోళిక రాజకీయాల పరంగా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్, జపాన్ కలిసికట్టుగా పనిచేయాలని, ఒక దేశం బలాన్ని మరో ఉదేశం ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వానికి భారత్–జపాన్ భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలియజేశారు. ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి రెండు దేశాలు సమానమైన సవాళ్లు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
13 ఎంఓయూలపై సంతకాలు
ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దడంలో ప్రజాస్వామ్య దేశాల పాత్ర సహజంగానే అధికంగా ఉంటుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ దిశగానే భారత్, జపాన్ కలిసి ప్రయాణం సాగిస్తున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య బలీయ బంధానికి.. పెట్టుబడులు, నవీన ఆవిష్కరణలు, ఆర్థిక భద్రత, పర్యావరణ పరిరక్షణ, అత్యాధునిక సాంకేతికత, ఆరోగ్యం, రవాణా, ప్రజల మధ్య పరస్పర సంబంధాలు, ప్రభుత్వం నడుమ భాగస్వామ్యమే ప్రాతిపదిక అని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీలో భాగస్వామ్యానికి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.
డిజిటల్ భాగస్వామ్యం 2.0, కృత్రిమ మేధ(ఏఐ) సహకార కార్యక్రమంపై సంప్రదింపులు జరుగుతున్నాయని స్పష్టంచేశారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రయాన్–5 మిషన్‌లో జపాన్ సైతం పాలుపంచుకోనుందని ప్రకటించారు. జపాన్ ప్రధాని ఇషిబా మాట్లాడుతూ.. తదుపరి తరం సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలంటే భారత్–జపాన్ సహకరించుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. మోదీ–ఇషిబా భేటీ సందర్భంగా భారత్–జపాన్‌లు 13 అవగాహనా ఒప్పందాల (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. రాబోయే పదేళ్లలో భారత్‌లో జపాన్ 10 ట్రిలియన్ యెన్‌లు (రూ.6 లక్షల కోట్లు) పెట్టుబడిగా పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. రక్షణ, నూతన ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికొచ్చాయి.
భారత్, చైనా ఒక్కటైతేనే..
ప్రపంచ ఆర్థిక క్రమం(ఆర్డర్)లో స్థిరత్వం తీసుకురావాలంటే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనా తప్పనిసరిగా కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం కోసం ఆసియాలో దిగ్గజ దేశాలైన భారత్, చైనా మధ్య స్నేహ సంబంధాలు బలపడాల్సిందేనని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాగిస్తున్న టారిఫ్‌ల యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్–చైనాలు ఒక్కటైతే ఇరుదేశాలతోపాటు ప్రపంచ దేశాలకు సైతం మేలు జరుగుతుందని చెప్పారు. జపాన్ పత్రిక యోమియురి షిమ్‌బన్‌కు ప్రధాని మోదీ శుక్రవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్–చైనా సంబంధాల ఆవశ్యకతను వివరించారు.
పెట్టుబడులకు స్వర్గధామం
పారిశ్రామికవేత్తలకు మోదీ పిలుపు
భారతదేశం అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయ, ఆర్థిక స్థిరత్వం, పరిపాలన–ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత దేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయని అన్నారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ శుక్రవారం జపాన్ రాజధాని టోక్యోలో భారత్–జపాన్ సంయుక్త ఆర్థిక సదస్సులో ప్రసంగించారు. జపాన్ కంపెనీలు ఇండియాలో 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు.