జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలే లక్ష్యం | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలే లక్ష్యం

Published Tue, Jul 20 2021 5:56 AM

Pegasus: Journalists and Human Rights Activists Identified as Targets - Sakshi

బోస్టన్‌: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పెగసస్‌ స్పైవేర్‌ ప్రధాన లక్ష్యం జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలేనని అంతర్జాతీయ మీడియా పరిశోధనలో తేలింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌ పలువురు ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్‌ చేసిందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. స్పైవేర్‌తో సంపాదించిన 50వేలకు పైగా ఫోన్‌ నెంబర్ల జాబితా ఫొరిబిడెన్‌ స్టోరీస్‌ అనే ఎన్‌జీఓకు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు దొరికింది. ఈ జాబితాను ప్రముఖ మీడియా గ్రూపులు విశ్లేషించాయి. 50 దేశాల్లో వెయ్యికి పైగా కీలక వ్యక్తులు నెంబర్లను ఇందులో గుర్తించారు. వీరిలో 189 మంది జర్నలిస్టులు, 600మంది రాజకీయవేత్తలు, 65మంది వ్యాపారులు, 85మంది మానవహక్కుల కార్యకర్తల నెంబర్లు ఇందులో ఉన్నాయని వాషింగ్టన్‌ పోస్టు ప్రకటించింది.

సీఎన్‌ఎన్, అసోసియేటెడ్‌ ప్రెస్, రాయిటర్స్, వాల్‌స్ట్రీట్‌ జర్నల్, ఫైనాన్షియల్‌ టైమ్స్‌ తదితర దిగ్గజ సంస్థల జర్నలిస్టుల నెంబర్లు ఈ జాబితాలో ఉన్నాయని తెలిపింది. ప్రముఖ జర్నలిస్టు ఖషోగ్గి హత్యకు నాలుగు రోజుల ముందు ఆయనకు కాబోయే భార్య ఫోనులో ఈ స్పైవేర్‌ ఇన్‌స్టాలైందని అమ్నెస్టీ తెలిపింది. ఈ ఆరోపణలన్నింటినీ ఎన్‌ఎస్‌ఓ కొట్టిపారేసింది. తాము ఎప్పుడూ ఎలాంటి టార్గెట్ల జాబితాను ఉంచుకోవమని తెలిపింది. తమపై వచ్చిన కథనాలు నిరాధారాలని నిందించింది.  అయితే ఈ వివరణలను విమర్శకులు తోసిపుచ్చుతున్నారు.  కాగా, తమకు లభించిన జాబితాలో 15వేలకు పైగా నంబర్లు మెక్సికోకు చెందినవని మీడియా వర్గాలు తెలిపాయి. తర్వాత అధిక సంఖ్యలో మధ్యప్రాచ్యానికి చెందిన ఫోన్లున్నట్లు తెలిపాయి. నిఘా స్పైవేర్‌కు సంబంధించి ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌పై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ గతేడాది ఇజ్రాయిల్‌ కోర్టులో దావా వేసింది. అయితే సరైన ఆధారాలు లేవని కోర్టు ఈ పిటిషన్‌ కొట్టేసింది.

ఆటంకవాదుల నివేదిక: షా
పెగసస్‌ స్పైవేర్‌ అంశంపై కాంగ్రెస్, అంతర్జాతీయ సంస్థలపై హోంమంత్రి అమిత్‌షా ఎదురుదాడి చేశారు. ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టారన్న నివేదికను భారత ప్రగతిని అడ్డుకునేందుకు కుట్రతో ఆటంకవాదులు రూపొందించిన అవాంతరాల నివేదికగా అభివర్ణించారు. పార్లమెంట్‌ సమావేశాల తరుణంలోనే ఎంపిక చేసినట్లు లీకేజీలు బయటకు రావడాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నుంచి ఇలాంటి దాడులు ఊహించినవేనని షా విమర్శించారు.  వారి పార్టీని వారు సరిదిద్దుకోలేని వారు పార్లమెంట్‌లో అభివృద్ధికర అంశాలను అడ్డుకునే యత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.  ఈ సమయంలో ప్రజాసంక్షేమాన్ని వదిలి ఇలాంటి అసత్య నివేదికలతో సభా సమయం వృధా చేయడం మంచిది కాదని హితవు చెప్పారు.
 
జాబితాలో రాహుల్, ప్రశాంత్‌ నంబర్లు!
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, బీజేపీ మంత్రులు అశ్విన్‌ వైష్ణవ్, ప్రహ్లాద్‌ సింగ్‌ పాటిల్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్, మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా ఫోన్‌ నంబర్లు పెగసస్‌ హ్యాకింగ్‌ జాబితాలో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.  పెగసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికిపైగా భారతీయులున్నట్లు ‘ది వైర్‌’ వార్తా సంస్థ పేర్కొంది.  పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, మాజీ సీజేఐ రంజన్‌ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు ఉద్యోగి, ఆమె చుట్టాల నంబర్లు ..ప్రముఖ వైరాలజిస్టు గగన్‌దీప్‌ కాంగ్, వసుంధరరాజే పర్సనల్‌ సెక్రటరీ తదితరులున్నారు.

భారత్‌పై బురద జల్లేందుకే...!
పెగాసస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి పలువురు ప్రముఖులపై నిఘా పెట్టారన్న వార్తలను కేంద్రం ఐటీ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ కొట్టిపారేశారు. పార్లమెంట్‌ సమావేశాలు ఆరంభమవుతున్నవేళ దేశ ప్రజాస్వామ్యానికి అపత్రిçష్ట అంటించేందుకే ఈ కథనాలను వండివారుస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎంతో పటిçష్టమైన వ్యవస్థలున్నాయని, అందువల్ల భారత్‌లో అక్రమ, అనైతిక నిఘా అసాధ్యమని చెప్పారు. ఈఅంశాన్ని పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు లేవనెత్తడంతో మంత్రి లోక్‌సభలో ఈ వివరణ ఇచ్చారు.  మీడియా జాబితాలో ఫోన్‌ నెంబరున్నంతమాత్రాన హ్యాకింగ్‌ జరిగినట్లు కాదని ఐటీ మంత్రి వ్యాఖ్యానించారు.  పెగాసస్‌ను ప్రభుత్వం వాడుతున్నదీ లేనిదీ తెలపలేదు.

అమిత్‌షా తొలగింపునకు కాంగ్రెస్‌ డిమాండ్‌
జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టిన పెగసస్‌ స్పైవేర్‌ అంశంలో హోంమంత్రి అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ అంశంలో ప్రధాని మోదీ పాత్రపై లోతైన విచారణ జరపాలని కోరింది. పెగసస్‌ అంశానికి షానే బాధ్యత వహించాలని, ఆయన్ను తొలగించాలన్నదే తమ ప్రధాన డిమాండని కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా ఇతర పార్టీల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై న్యాయ లేదా పార్లమెంటరీ విచారణ కోరే అంశమై అన్ని పార్టీలతో కాంగ్రెస్‌ చర్చిస్తుందన్నారు.  హోంమంత్రి పదవికి షా అనర్హుడని రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గే విమర్శించారు.  డిజిటల్‌ ఇండియా అని మోదీ చెబుతుంటారని, కానీ నిజానికి ఇది నిఘా ఇండియా అని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ దుయ్యబట్టారు. షాను వెంటనే ఎందుకు తొలగించరని ప్రశ్నించారు. ఈ నిఘా వ్యవహారం మొత్తం మోదీ ప్రభుత్వ కన్నుసన్నులోనే జరిగిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.  

మోదీ, అమిత్‌షా స్పందించాలి
పెగసస్‌తో ప్రముఖుల సమాచారం హ్యాక్‌ అయిందన్న వార్తలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా స్పందించాలని శివసేన డిమాండ్‌ చేసింది. దేశంలో ప్రభుత్వం, యంత్రాంగం బలహీనంగా ఉన్నాయని ఈ ఘటన చెబుతోందని సేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ విమర్శించారు. ప్రజలకు ప్రధాని, హోంమంత్రి ఈ అంశంపై స్పష్టతనివ్వాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement