
దక్షిణం వైపు వెళ్లిపోవాలంటూ ప్రజలకు హెచ్చరికలు
మంగళవారం దాడుల్లో 68 మంది మృత్యువాత
ఇజ్రాయెల్ జనహననానికి పాల్పడుతోందన్న ఐరాస
జెరూసలేం: గాజా నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ మంగళవారం దాడులను మరింత తీవ్రతరం చేసింది. హమాస్ సైనిక వనరుల నాశనమే లక్ష్యంగా గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టినట్లు ప్రకటించింది. ‘ప్రమాదకరమైన యుద్ధ జోన్’గా మారిన నగరాన్ని వీడి దక్షిణప్రాంతంలోని అల్ మువాసిలో ఏర్పాటు చేసిన మానవీయ జోన్‌కు తరలివెళ్లాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం రాత్రి నుంచి కొనసాగిస్తున్న దాడుల్లో మరో 68 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఎడతెగని దాడులతో భీతిల్లిన జనం నగరాన్ని వీడి పెద్ద సంఖ్యలో వెళ్లిపోతున్నారు.
తీరం వెంబడి రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. అంతకుముందు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ మంగళవారం ఉదయం ‘గాజా తగులబడుతోంది’అంటూ వ్యాఖ్యానించారు. హమాస్ సాయుధ వనరులను ధ్వంసం చేసి, బందీలను విడిపించుకుంటామన్నారు. లక్ష్యం నెరవేరేదాకా వెనక్కి తగ్గేది లేదన్నారు. దీంతో, ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్థం తీవ్రరూపం దాల్చగా, కాల్పుల విరమణ కోసం ఇప్పటి వరకు కొనసాగిన దౌత్యప్రయత్నాలకు ముగింపు పలికినట్లేనని భావిస్తున్నారు.
ఆగని మారణకాండ
గాజా నగర జనాభా దాదాపు 10 లక్షలు కాగా ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో గత నెల నుంచి ఇప్పటి వరకు 2.20లక్షల మంది దక్షిణాదికి వలస వెళ్లినట్లు ఐరాస అంచనా వేసింది. మంగళవారం ఈ నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులను ఉధృతం చేసింది. ఈ దాడుల్లో కనీసం 68 మంది చనిపోయినట్లు అల్ జజీరా తెలిపింది. సోమవారం రాత్రంతా శతఘ్నులు, హెలికాప్టర్లు, క్షిపణులు, డ్రోన్లు, ఎఫ్–16 యుద్ధ విమానాలతోవిరామం లేకుండా బాంబింగ్ కొనసాగిందని షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబూ సెల్మియాహ్ వ్యాఖ్యానించారు. తమ ఆస్పత్రికి పదుల సంఖ్యలో మృతదేహాలు వచ్చాయన్నారు. కనీసం 90 మంది క్షతగాత్రులకు చికిత్స చేశామన్నారు. భవనాల శిథిలాల కింద చాలామందే చిక్కుకుని ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ శత్రువు: ఈజిప్టు
అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో సోమవారం ఇజ్రాయెల్ చేరుకుని, ప్రధాని నెతన్యాహూతో చర్చలు జరిపారు. గాజాలో క్షేత్రస్థాయి ఆపరేషన్ ప్రారంభమైనందున, ఒప్పందం కుదుర్చుకునేందుకు తగు సమయం లేదంటూ వ్యాఖ్యానించారు. ఎంతో ముఖ్యమైన ఈ ఆపరేషన్ కొన్ని వారాల్లోనే ముగియనుందన్నారు. అనంతరం ఆయన ఖతార్ రాజధాని దోహాకు చేరుకున్నారు. దోహాలో జరుగుతున్న అరబ్, ముస్లిం దేశాల నేతల సమావేశం ఖతార్‌పై ఇజ్రాయెల్ గత వారం చేపట్టిన దాడులను తీవ్రంగా ఖండించింది.
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలపై ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. అయితే, ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధానికి దౌత్యప రమైన ఒత్తిడుల ద్వారా ముగింపునకు తేవాలని నిర్ణయించింది. ఇజ్రాయెల్‌ను శత్రువంటూ దోహాలో జరిగిన సమావేశంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిస్సి అభివర్ణించారు. 1979లో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలయ్యాక ఇజ్రాయెల్‌ను ఆ దేశం ఇంత తీవ్రంగా నిందించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. అయితే, ఇది కేవలం తమ అసంతృప్తి తీవ్రతను వ్యక్తం చేసేందుకే తప్ప, ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంచుకునేందుకు కాదని అంటున్నారు.
జన హననానికి ఆధారాలు
ఇజ్రాయెల్ ఆర్మీ గాజా ప్రాంతంలో జనహననానికి పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమితి నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ పేర్కొంది. మారణహోమానికి ముగింపు పలికి, ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఈ కమిటీ 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ సాగిస్తున్న దాడులు, మానవహక్కుల ఉల్లంఘన పర్యవసానాలను రికార్డు చేసింది.