
ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన పాలస్తీనియన్లు
వెల్లడించిన గాజాస్ట్రిప్ ఆరోగ్య విభాగం
తాజాగా మరో 30 మంది మృతి
దెయిర్ అల్–బలాహ్: గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో మరణాలు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 21 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 58 వేల మంది పాలస్తీనియన్లు అసువులు బాసినట్లు ఆదివారం గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. మృతుల్లో సగానికి పైగా మహి ళలు, చిన్నారులే ఉన్నారంది. క్షత గాత్రుల సంఖ్య లక్ష్యల్లోనే ఉంటుందని అంచనా. యుద్ధ మరణాలపై గాజా ఆరోగ్య విభాగం విడుదల చేసే గణాంకాలను ఐక్యరాజ్యస మితితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీ యమైనవిగా భావిస్తున్నాయి.
నీళ్ల కోసం వచ్చి ఆరుగురు బాలలు మృతి
గాజాపై ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో 30 మంది చనిపోయారు. వీరిలో నీళ్ల ట్యాంకు వద్దకు వచ్చిన ఆరుగురు చిన్నారులున్నారు. సెంట్రల్ గాజా నగరంలో ఓ వీధిలో నడిచి వెళ్తున్న వారిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 11 మంది చనిపోగా 30 మంది క్షతగాత్రులుగా మారారు. మృతుల్లో అల్–అహ్లి ఆస్పత్రి జనరల్ సర్జన్ డాక్టర్ అహ్మద్ ఖండిల్ కూడా ఉన్నారు. ఆస్పత్రికి వస్తుండగా దాడికి గురయ్యారని అధికారులు తెలిపారు. జవైదాలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంటిపై దాడి విషయం తమకు తెలీదని, 24 గంటల వ్యవధిలో గాజాలోని 150 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. కాగా, వెస్ట్‌బ్యాంక్‌లో శనివారం ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో చనిపోయిన పాలస్తీనా అమెరికన్ సైఫొల్లా ముసల్లెట్(20), అతని స్నేహితుడు మహ్మద్ అల్ షలాబీలకు ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ సారథ్యంలో సాయుధులు ఇజ్రాయెల్ భూభాగంపై మెరుపుదాడులు చేసి సుమారు 1,200 మందిని చంపడంతోపాటు 251 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. ఆ రోజు నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ లక్ష్యంగా గాజాపై యథేచ్ఛగా దాడులు సాగిస్తోంది.