అద్దెకు అణుబాంబు! సౌదీకి పాక్ అణ్వాయుధాలు? | Pakistan nuclear weapons to Saudi Arabia | Sakshi
Sakshi News home page

అద్దెకు అణుబాంబు! సౌదీకి పాక్ అణ్వాయుధాలు?

Sep 18 2025 10:23 PM | Updated on Sep 18 2025 10:30 PM

Pakistan nuclear weapons to Saudi Arabia

రక్షణ ఒప్పందంపై షరీఫ్, సల్మాన్ సంతకాలు.  ‘ఇస్లామిక్ నాటో’ దిశగా ముందడుగు?  భావి విపరిణామాలపై భారత్ అధ్యయనం. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాల్లో మారనున్న సమీకరణాలు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) తమ ఇరు దేశాల మధ్య ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ (ఎస్ఎండీఏ) కుదుర్చుకున్నారు. ఇది ‘నాటో’ కూటమి నిబంధనల్లోని ఆర్టికల్ 5 లాంటిదే. పాక్, సౌదీ...  ఈ రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై ఎవరు దాడికి దిగినా ఆ రెండు దేశాలపై దాడికి పాల్పడినట్టే. 

సౌదీపై ఏ దేశమైనా దాడికి తెగబడితే పాకిస్థాన్ మీదా దండెత్తినట్టే. పాక్ మీద ఏ దేశమైనా దాడికి దిగితే సౌదీపైనా యుద్ధం ప్రకటించినట్టే. సౌదీ అరేబియాతో పాక్ తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం సారాంశమిదే. ఇరాన్ కనుక అణ్వాయుధం తయారుచేస్తే, తాము కూడా సాధ్యమైనత త్వరలో అణుబాంబు రూపొందిస్తామని 2018లో ‘సీబీఎస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ప్రకటించడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఆయన ప్రకటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. ఇరాన్-సౌదీ అరేబియా నడుమ శతృత్వం ఉంది. 

అటు ఇజ్రాయెల్-ఇరాన్ నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇదే సమయంలో ఇరుగుపొరుగు దేశాలైన భారత్-పాక్ దాయాదులనే అంశాన్ని విస్మరించకూడదు. పాక్-సౌదీ తాజా ఒప్పందాన్ని పరిశీలిస్తే... ‘భవిష్యత్తులో ఆపరేషన్ సిందూర్’ లాంటి సందర్భాల్లో పాక్ కు సౌదీ సాయం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పాక్-సౌదీ తాజా ఒప్పందం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అధ్యయనం చేసే పనిలో భారత్ పడింది. మొత్తంమీద ఈ పరిణామం అటు మధ్యప్రాచ్యంలో, ఇటు దక్షిణాసియాలో మిలిటరీ సమీకరణాలపై ప్రభావం చూపిస్తుందనే చెప్పాలి. 

పాక్-సౌదీ ‘అణు’బంధం ఏనాటిదో!  
సౌదీ అరేబియాకు అణ్వాయుధాలను గానీ, అణు పరిజ్ఞానాన్ని గానీ పాక్ బదిలీ చేసినట్టు ఆధారాలు లేకపోయినప్పటికీ ... అందుకు గల అవకాశాలపై మాత్రం రక్షణ వర్గాల్లో దశాబ్దాలుగా చర్చ సాగుతోంది. సౌదీ-ఇరాన్ వైరం, మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం భౌగోళికంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్, ఇరాక్ వంటి శత్రుదేశాలు సౌదీ చుట్టూ మోహరించాయి. మరోవైపు సౌదీ కూడా ఏదైనా సున్నీ ముస్లిం దేశపు గట్టి భాగస్వామ్యం కోసం నిరీక్షిస్తోంది. 

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలతో శాంతి, సామరస్యాల కోసం ఇటీవల మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రయత్నాలు చేసినప్పటికీ 2023 అక్టోబరు నుంచి గాజాలో మొదలైన యుద్ధం, అమెరికా మళ్లీ అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ విధానం వంటివి మధ్యప్రాచ్యంలో పెను మార్పులకు దోహదం చేశాయి. నిఘా సమాచారం పంచుకోవడం, సైబర్ సెక్యూరిటీ పరంగా సహకారం, సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ వంటి అంశాలు పాక్-సౌదీ తాజా ఒప్పందంలో ఉన్నాయి. 

అణ్వాయుధాల ప్రస్తావన ఒప్పందంలో లేకున్నప్పటికీ భవిష్యత్తులో ప్రాంతీయంగా ముప్పు తలెత్తితే అది అణు సహకారానికి కూడా దారితీయవచ్చనేది విశ్లేషకుల భావన. అంటే తమకు ముప్పు వాటిల్లే పక్షంలో రక్షణార్థం అమెరికా యుద్ధనౌకల కోసం సౌదీ ఎదురుచూడాల్సిన అగత్యం ఉండబోదు. తనకంటూ తన చేతిలో ఓ ఆయుధాన్ని సౌదీ సిద్ధం చేసుకునే ప్రయత్నమే ఇది. ట్రంప్ పాలనా యంత్రాంగానికి ఇది ఎదురుదెబ్బ మాత్రమే కాదు... చెంపపెట్టు కూడా! చారిత్రకంగా చూస్తే పాక్-సౌదీ నడుమ 1970ల నుంచే సత్సంబంధాలు ఉన్నాయి. 

పాక్ కు ఆర్థిక సాయం, చౌకగా చమురు, సైనిక తోడ్పాటును సౌదీ అరేబియా అందించింది. ప్రతిగా పాక్ వేలాదిగా తమ సైనిక బలగాలను సౌదీలో మోహరించి ఆ దేశ సైనికులకు శిక్షణ ఇచ్చింది. మక్కా, మదీనా పరిరక్షణ కోసం తమ జవాన్లను తరలించింది. పాక్ రక్షణ రంగంలో సౌదీ భారీగా పెట్టుబడులు పెట్టింది. పాక్ అణు కార్యక్రమానికి వంద కోట్ల డాలర్ల పైగా నిధులను సౌదీ సమకూర్చినట్టు సీఐఏ అధికారి ఒకరు 1980లలో పేర్కొన్నారు. 

1980ల నుంచి పాకిస్థాన్ ఆర్థిక, సైనిక రంగాలకు 30 బిలియన్ డాలర్లకు పైగా సౌదీ సాయం చేసినట్టు ‘ది యూరేషియన్ టైమ్స్’ వెల్లడించింది. ఆయుధాలు, ప్రాజెక్టుల రూపేణా 5-10 బిలియన్ డాలర్ల మేర సౌదీ అరేబియా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని, 100 బిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిన పాక్ కు ఇది ఉపశమనం కలిగించవచ్చని అంచనా. అలాగని ఇది సౌదీ సాయం చేసినట్టేమీ కాదు! పాక్ నియంత్రణ సౌదీ చేతిలోనే ఉంటుంది. 

కారుకు ఇంధనం నింపి తాళంచెవిని సౌదీ తన చేతిలో పెట్టుకోవడం లాంటిది ఇది! ఇటు పాక్ వైపు నుంచి కూడా పోయేదేమీ లేదు. దాని వైమానిక దళానికి సౌదీ సాంకేతికత అందుతుంది. ప్రమాదాలను గుర్తించేలా రాడార్స్ అమర్చిన విమానాలు, సరిహద్దుల్లో తాలిబాన్ గ్రూపులకు సంబంధించిన నిఘా సమాచారం లభిస్తాయి. పాక్ వైమానిక బలహీనతలను భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఎత్తిచూపింది. 

ఈ నేపథ్యంలో సౌదీతో సరికొత్త చెలిమి దానికి బలం కల్పించేదే. ఇక్కడ కేవలం విశ్వసనీయతే కాదు... డబ్బు అంశమూ ముడిపడివుంది. ఒకవేళ సౌదీ అరేబియాపై ఇజ్రాయెల్ దాడి చేసిందనుకుందాం. అప్పుడు సౌదీకి మద్దతుగా పాక్ ఎంత దీటుగా పోరాడుతుందనేది సౌదీ నుంచి ఆ దేశానికి పారే ‘నిధుల ప్రవాహం’పై ఆధారపడి ఉంటుంది! 

సౌదీకి పాక్ అణు కవచం!
భవిష్యత్తులో తనకు అవసరమైతే పాక్ నుంచి అణ్వాయుధాలను పొందేలా సౌదీకి రహస్య ఒప్పందం ఉందన్న ఊహాగానాలు ఈనాటివి కావు. 2003లో అప్పటి సౌదీ యువరాజు అబ్దుల్లా పాక్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రహస్య అణు ఒప్పందంపై చర్చలు సాగినట్టు పాక్ వర్గాలు 2003లో వెల్లడించాయి. ‘సౌదీకి పాక్ అణ్వాయుధాలు- బదులుగా పాక్ కు సౌదీ చమురు’… ఆ చర్చల ప్రధానాంశమని నాడు వార్తలు వెలువడ్డాయి. అయితే తమ మధ్య అలాంటి ఒప్పందమేదీ కుదరలేదని రెండు దేశాలు స్పష్టీకరించాయి. 

శాంతియుత ప్రయోజనాల కోసమే తమకు అణుశక్తి అవసరమని సౌదీ చెబుతూ వస్తోంది. 16 అణు రియాక్టర్లు నిర్మించాలన్న తన ప్రణాళికలను అది 2010లో ప్రకటించింది. అయితే ఈ అంశంలో పెద్ద పురోగతి లేదు. విశేషమేమిటంటే... ‘అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం (న్యూక్లియర్ నాన్-ప్రాలిఫరేషన్ ట్రీటీ- ఎన్పీటీ) అడిషనల్ ప్రొటోకాల్ మీద సౌదీ అరేబియా నేటి వరకు సంతకాలు చేయలేదు. దీని ప్రకారం కట్టుదిట్టమైన అంతర్జాతీయ తనిఖీలు ఎదుర్కోవాల్సివుంటుంది. చైనా సహకారంతో యురేనియం వెలికితీత కేంద్రాన్ని సౌదీ అరేబియా నిర్మించినట్టు 2020లో ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఓ వార్తాకథనం ప్రచురించింది. 

అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ చర్య అనుమతించదగ్గదే అయినప్పటికీ ఇది ‘రెండు రకాల ప్రయోజనాల’ (అణు విద్యుదుత్పత్తి, అణ్వాయుధాల తయారీ) కోసం ఉద్దేశించినదన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. అవసరమైతే పాక్ అణు వార్ హెడ్లను మోసుకెళ్లే విధంగానే తమ క్షిపణులను సౌదీ సిద్ధం చేస్తున్నట్టు 1988 నాటి పత్రాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అణ్వాయుధాలు కలిగిన అతి కొద్ది ముస్లిం దేశాల్లో పాక్ ఒకటి. 

ఉత్తర కొరియా, ఇరాన్, లిబియాలతో పాక్ కు చెందిన ‘అబ్దుల్ ఖదీర్ ఖాన్ నెట్వర్క్’ అణు సంబంధాలు నెరపినట్టు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఇరాన్ కనుక అణ్వాయుధాలను తయారుచేసే పక్షంలో సౌదీ అరేబియా కూడా పాక్ నుంచి ‘అణు వార్ హెడ్స్’ను కొనుగోలు చేయడమో, వాటిని ‘అప్పు/అద్దె ప్రాతిపదికన తీసుకోవడమో’ చేస్తుందని నిపుణుల అంచనా. ‘ముస్లిం దేశాల రక్షణకర్త’ పాత్రను పాక్ రక్తి కట్టిస్తోందా? పాక్ నేతృత్వంలోని ‘ఇస్లామిక్ నాటో’ కూటమిలో చేరిన తొలి సభ్యదేశంగా సౌదీ అరేబియాను చూడవచ్చా?! 
- జమ్ముల శ్రీకాంత్ 
(Source: The EurAsian Times, WION).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement