ఇస్లామాబాద్: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కొద్దిరోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు, ప్రతి దాడులతో రెండు దేశాల సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మరోవైపు.. ఇరు దేశాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల్లో ఒప్పందం కుదరకపోతే బహిరంగ యుద్దమే అని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.
తాజాగా పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఆఫ్ఘనిస్థాన్ శాంతిని కోరుకుంటుందనే విశ్వాసం ఉంది. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే వాళ్లతో బహిరంగ యుద్ధం చేస్తాం. అందుకు మాకు ఓ అవకాశం ఉంది. కానీ, వాళ్లు శాంతిని కోరుకుంటారని విశ్వసిస్తున్నా. ఇరు పక్షాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నాయని అనుకుంటున్నా. గత నాలుగైదు రోజులుగా సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి’ అని అన్నారు. అయితే, ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ ఆసిఫ్ ఈ విధంగా స్పందించారు.
Former Interior Minister Aftab Sherpao Criticizes Khawaja Asif’s Remarks on Possible War with Afghanistan
Pakistan’s former Interior Minister and head of the Qaumi Watan Party, Aftab Sherpao, has called Khawaja Asif’s recent statement—that Pakistan could wage an open war against… pic.twitter.com/3u94aQcvss— Truth Lens (@truthlenns) October 26, 2025
ఆసిఫ్‌కు కౌంటర్..
మరోవైపు.. మహమ్మద్ ఆసిఫ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ మంత్రి, క్వామి వతన్ పార్టీ అధినేత అఫ్తాబ్ షెర్పావ్ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా అఫ్తాబ్ స్పందిస్తూ..‘ఆసిఫ్ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం. ప్రభుత్వ సీనియర్ మంత్రి నుండి ఇటువంటి వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీస్తాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చల ప్రక్రియను దెబ్బతీస్తాయి. చర్చల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దశాబ్దాల సంఘర్షణలో అధికారులు శాంతి, ప్రాంతీయ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన భవిష్యత్తును నిర్ధారిస్తారు’ అని కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో దోహా వేదికగా రెండోసారి శాంతి చర్చలు జరుగుతున్నాయి. కాగా, అక్టోబర్ 18,19 తేదీల్లో జరిగిన మొదటి చర్చల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్‌లు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ క్రమంలోనే శనివారం ఇస్తాంబుల్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి. ఆదివారం కూడా చర్చలు కొనసాగుతున్నాయి.


