పాకిస్తాన్ మొత్తం షట్‌డౌన్‌ కాబోతోందా? | Is Pakistan Heading Toward a Lockdown Economic Crisis | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ మొత్తం షట్‌డౌన్‌ కాబోతోందా?

Apr 3 2026 6:18 PM | Updated on Apr 3 2026 6:37 PM

Is Pakistan Heading Toward a Lockdown Economic Crisis

ప్రస్తుతం  మళ్ళీ 'లాక్‌డౌన్' అనే మాట వినిపిస్తోంది. అయితే ఇది గతంలో మనం చూసిన కరోనా లాక్‌డౌన్ లాంటిది కాదు. ఒక దేశం ఆర్థికంగా, రాజకీయంగా మరియు అంతర్జాతీయ యుద్ధ పరిణామాల వల్ల ఏ స్థాయి సంక్షోభంలోకి వెళ్తుందో చెప్పడానికి  ప్రస్తుత పరిస్థితే నిదర్శనం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పాకిస్తాన్ మొత్తం షట్ డౌన్ కాబోతోందా? అసలు ప్రభుత్వం ఆలోచన ఏంటి? 

లాక్ డౌన్ అనగానే మనలో ప్రతి ఒక్కరికి ముచ్చెమటలు పోస్తాయి. నాటి లాక్ డౌన్ లో పడ్డ కష్టాలు అటువంటివి మరి. అయితే మళ్ళీ మనం లాక్ డౌన్ లోకి వెళ్ళనున్నామా.. పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తున్నాయి. కాని ఈ సారి ఈ లాక్ డౌన్ ముందుగా మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో రానుంది. అసలు అక్కడ లాక్‌డౌన్ ఆలోచన వెనుక ఉన్న ప్రధాన కారణం 'ఇంధన కొరత'. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం)లో జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves) అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అంటే, బయట దేశాల నుండి పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొనడానికి వారి దగ్గర తగినంత డబ్బు లేదు. అందుకే, దేశంలో ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని పొదుపు చేయడానికి 'స్మార్ట్ లాక్‌డౌన్' విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.

పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ తదితర ఉన్నతాధికారులు ఇటీవలే ఒక కీలక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట మార్కెట్లను , వ్యాపార సముదాయాలను త్వరగా మూసివేయాలని వారు ప్రతిపాదించారు. అంటే పాకిస్తాన్‌లో రాత్రి 8 లేదా 9 గంటలకే అన్ని షాపింగ్ మాల్స్, మార్కెట్లు మూసివేసేట్టుగా చూడాలి అని తీర్మానం చేశారు. అలాగే కార్యాలయాలకు వారంలో 5 రోజులు కాకుండా, కేవలం 3 లేదా 4 రోజులు మాత్రమే ఆఫీసులకు రావాలని, మిగిలిన రోజులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేయాలని సూచించారు. దీనివల్ల రవాణా ఖర్చులు, ఏసీలు అలాగే విద్యుత్ వినియోగం తగ్గుతుందని వారి ప్లాన్.

పాకిస్తాన్ లోని కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, పాకిస్తాన్‌లోని ప్రావిన్షియల్ ప్రభుత్వాలు (రాష్ట్రాలు) దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం (Inflation) వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారని, ఇప్పుడు మళ్ళీ లాక్‌డౌన్ విధిస్తే వ్యాపారాలు దెబ్బతిని నిరుద్యోగం మరింత పెరుగుతుందని వారు వాదిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ , సింధ్ ప్రావిన్సులు పూర్తి స్థాయి లాక్‌డౌన్ వద్దని, కేవలం కొన్ని నియంత్రణలు మాత్రమే విధిద్దామని స్పష్టం చేశాయి. గత కొద్ది రోజులుగా పాకిస్తాన్‌లో "కంప్లీట్ వీకెండ్ లాక్‌డౌన్" విధించారంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే పాకిస్తాన్ సమాచార శాఖ దీనిని ఖండించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలాంటి అధికారిక లాక్‌డౌన్ లేదు. కేవలం పొదుపు చర్యలు (Austerity Measures) మాత్రమే అమల్లో ఉన్నాయి. ఫేక్ న్యూస్‌ని నమ్మవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయితే ఏ నిమిషమైనా లాక్ డౌన్ వార్తలు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

ఒక పక్క లాక్‌డౌన్ భయం, మరోపక్క ఆకాశాన్ని తాకుతున్న ధరలు. పాకిస్తాన్‌లో సామాన్యుడి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. గోధుమ పిండి నుండి పప్పుల వరకు ప్రతి వస్తువు ధర రెండింతలు పెరిగింది. విద్యుత్ బిల్లులు కట్టలేక ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్ విధిస్తే అది "పుండు మీద కారం చల్లినట్లు" అవుతుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ పరిస్థితి మెరుగుపడాలంటే ఐఎంఎఫ్ (IMF) నుండి మరో విడత రుణం రావడం చాలా ముఖ్యం. కానీ ఐఎంఎఫ్ విధించే కఠినమైన షరతులు సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఒకవేళ మిడిల్ ఈస్ట్ యుద్ధం గనుక మరింత ముదిరితే, చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు పాకిస్తాన్ తప్పనిసరి పరిస్థితుల్లో దేశం మొత్తాన్ని మూసివేయాల్సి రావచ్చు.

మొత్తానికి చూస్తే, పాకిస్తాన్ ప్రస్తుతం ఒక "ఎకనామిక్ లాక్‌డౌన్"లో ఉంది. అధికారికంగా షాపులు తెరిచి ఉన్నా, కొనే శక్తి ప్రజలకు లేదు. ప్రభుత్వం పెట్రోల్ ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నా, అది ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. పొరుగు దేశంలో నెలకొన్న ఈ అస్థిరత దక్షిణాసియా ప్రాంతంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఒక్క పాకిస్తాన్ కే కాదు మనకూ ఓ హెచ్చరికే.అప్పుడెప్పుడో కరోనా వేల కిలోమీటర్ల అవతల ఉంది మనకేం కాదులే అనుకున్న క్షణం పట్టలేదు కరోనా అనే మహమ్మారి మన పై విరుచుకుపడి లాక్ డౌన్ లోకి రోజుల్లో తీసుకువెళ్ళిపోయింది. మరి ఇప్పుడూ కరోనా కన్నా ప్రమాదమైన యుద్ధం క్షణక్షణం ఉత్కంఠతతో ఏ దేశం మీద ఎటువంటి ప్రభావం చూపనుందో అర్ధం కాని పరిస్థితి. లాక్ డౌన్ అనేది మన లోగిలిలోకి రాకూడదని గట్టిగా అనుకుందాం ప్రార్ధిద్దాం. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement