పాక్‌ వైమానిక స్థావరంలో ఇరాన్‌ యుద్ధ విమానాలు | Pakistan Allowed Iranian Aircraft To Park At Nur Khan Air Base | Sakshi
Sakshi News home page

పాక్‌ వైమానిక స్థావరంలో ఇరాన్‌ యుద్ధ విమానాలు

May 13 2026 3:28 AM | Updated on May 13 2026 3:28 AM

Pakistan Allowed Iranian Aircraft To Park At Nur Khan Air Base

పలు రక్షణ ఆస్తులను తరలించిందని సీబీఎస్‌ నివేదిక

కాల్పుల విరమణ ప్రకటన తరువాత పాక్‌కు తరలించిన ఇరాన్‌ 

దాడుల నుంచి రక్షించుకోవడానికే అయి ఉంటుందన్న అమెరికా అధికారులు

వాషింగ్టన్‌: పశ్చిమాసియా సంఘర్షణల నేపథ్యంలో అమెరికా–ఇరాన్‌ మధ్య దౌత్య మధ్యవర్తిగా పాకిస్తాన్‌ ప్రదర్శించుకున్న తీరు అందరికీ తెలిసిందే. అయితే, ఈ సమయంలో ఇరాన్‌ సైనిక విమానాలను నిలిపి ఉంచడానికి పాకిస్తాన్‌ తన కీలక వైమానిక స్థావరాల్లో ఒకదానిలో అనుమతించిందని ఓ నివేదిక వెల్లడించింది. రావల్పిండికి కొద్ది దూరంలో ఉన్న నూర్‌ ఖాన్‌లోని పాకిస్తాన్‌ వైమానిక దళ స్థావరానికి ఇరాన్‌ అనేక కీలక రక్షణ ఆస్తులను తరలించిందని పేర్కొంది. అధికారికంగా కాల్పుల విరమణ ప్రయత్నాలకు పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం వహిస్తున్న సమయంలో, ఇరాన్‌ తన సైనిక, విమానయాన ఆస్తులను రక్షించుకోవడానికి ఇస్లామాబాద్‌ సమీపంలో ఉన్న ఈ వ్యూహాత్మకంగా ముఖ్యమైన సైనిక స్థావరం ఆశ్రయాన్ని కల్పించింది.

ఈ సైనిక పరికరాలలో, లాక్‌హీడ్‌ సంస్థ తయారు చేసిన సి–130 హెర్క్యులస్‌ వ్యూహాత్మక రవాణా విమానానికి చెందిన నిఘా, గూఢచార సేకరణ వేరియంట్‌ అయిన ఇరాన్‌ వైమానిక దళానికి చెందిన ఆర్‌సి–130 కూడా ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఇరాన్‌–అమెరికా సంక్షోభ సమయంలో అమెరికాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే, ఇరాన్‌కు గానీ, దాని మిత్రదేశం, పాకిస్తాన్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు అయిన చైనాను గానీ దూరం చేసుకునే చర్యలకు పాక్‌ దూరంగా ఉండటాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇరాన్‌ వద్ద మిగిలి ఉన్న వైమానిక, సైనిక ఆస్తులను అమెరికా దాడుల నుంచి రక్షించుకోవడానికే ఈ తరలింపునకు కారణమై ఉంటుందని అమెరికా అధికారులు భావిస్తున్నారు.  

నివేదికపై తీవ్ర వ్యతిరేకత.. 
ఈ నివేదిక అమెరికాలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాక్‌ తటస్థతను అమెరికా చట్టసభ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సన్నిహిత మిత్రుడు, సీనియర్‌ రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహం ఈ నివేదికపై ఎక్స్‌లో స్పందించారు. ఈ సంక్షోభంలో పాకిస్తాన్‌ దౌత్య పాత్రను పునఃసమీక్షించాలని పిలుపునిచ్చారు.

‘ఈ నివేదిక కచ్చితమైనదైతే, ఇరాన్‌–అమెరికా మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్‌ పోషిస్తున్న పాత్రను పూర్తిగా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇజ్రాయెల్‌పై పాకిస్తాన్‌ రక్షణ అధికారులు గతంలో చేసిన కొన్ని ప్రకటనలను గమనిస్తే, ఇది నిజమైనా నేను ఆశ్చర్యపోను’అని గ్రాహం పేర్కొన్నారు. అయితే, నూర్‌ ఖాన్‌ ఎయిర్‌ బేస్‌కు సంబంధించిన ఆరోపణలను పాకిస్తాన్‌ సీనియర్‌ అధికారి ఖండించారు. జనసాంద్రత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతంలో ఆ బేస్‌ ఉన్నందున అటువంటి కార్యకలాపాలు రహస్యంగా ఉండటం సాధ్యం కాదని తెలిపారు.  

కాబూల్‌లోనూ..  
అంతేకాదు, ఇరాన్‌ పౌర విమానాలను పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు కూడా తరలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ విమాన ప్రయాణాల్లో సైనిక విమానాలు ఉన్నాయో, లేదో స్పష్టంగా తెలియదని అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే, ఘర్షణలు ప్రారంభం కావడానికి కొద్ది ముందే మహాన్‌ ఎయిర్‌ విమానం ఒకటి కాబూల్‌లో దిగిందని, ఇరాన్‌ గగనతలం మూసివేయడంతో అది అక్కడే ఉండిపోయిందని ఆఫ్ఘన్‌ పౌర విమానయాన అధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్‌ వైమానిక దాడుల తర్వాత కాబూల్‌ విమానాశ్రయాన్ని కూడా లక్ష్యంగా చేసుకోవచ్చనే భయాలు పెరగడంతో, ఆ విమానాన్ని ఇరాన్‌ సరిహద్దు సమీపంలోని హెరాత్‌ విమానాశ్రయానికి తరలించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇరాన్‌ విమానాలు ఉన్నాయన్న వార్తలను తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిడ్‌ తోసిపుచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement