ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్‌ వైమానిక దాడులు | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్‌ వైమానిక దాడులు.. 8 మంది మృతి

Published Mon, Mar 18 2024 1:34 PM

Pakistan Air Strikes In Afghanistan 8 Killed - Sakshi

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్‌ సైన్యం సోమవారం తెల్లవారుజామున జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందారు.  మృతి చెందిన వారిలో అందరూ మహిళలు, చిన్న పిల్లలే. ఇవి బాధ్యత రహితమైన దాడులని ఆప్ఘనిస్తాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు తాలిబన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.

పాకిస్తాన్‌ సరిహద్దులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఖోస్ట్‌, పక్టికా ప్రావిన్సుల్లోని  పౌరుల నివాసాలపై సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ వైమానిక దాడులు జరిగినట్లు తాలిబన్లు తెలిపారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇవి ఆఫ్ఘనిస్తాన్‌ సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించే దాడులని పేర్కొన్నారు. 

కాగా, ఆదివారం ఆఫ్ఘన్‌ సరిహద్దు వెంబడి పాక్‌ భూభాగంలోనే పాకిస్తాన్‌ సైన్యంపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్‌ సైనికులు పలువురు చనిపోయారు. వీటికి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్‌ అధ్యకక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆఫ్ఘనిస్తాన్‌పై వైమానిక దాడులు జరగడం గమనార్హం.

పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో తెహ్రీక్‌ ఈ తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) అనే మిలిటెంట్‌ గ్రూపునకు గట్టి పట్టుంది. ఈ మిలిటెంట్లు పాకిస్తాన్‌ సైనికులపై దాడి జరిపి లెఫ్టినెంట్‌ కల్నల్‌తో సహా పలువురు జవాన్లను హతమార్చారు. వీరి అంత్యక్రియల సమయంలోనే ప్రతీకారం తీర్చుకుంటామని జర్దారీ ప్రకటించారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

ఇదీ చదవండి.. అడుగు దూరంలో వరల్డ్‌ వార్‌-3.. హెచ్చరించిన పుతిన్‌ 

Advertisement
Advertisement