
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా తమ దేశంపైకి దూసుకొచ్చిన బ్రహ్మోస్ క్షిపణితో హడలిపోయామని పాక్ ప్రధాని షెహబాజ్ సలహాదారు రానా సనుల్లాహ్ స్పష్టం చేశారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన బ్రహ్మోస్ క్షిపణితో భారత్ ఏమైనా అణు యుద్ధాన్ని ఆరంభించిందా అనే ఆలోచనలో పడ్డామన్నారు. రావల్పిడింలోని తమ ప్రధాన ఎయిర్ బేస్ నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ప్రయోగించిన క్రమంలో కాసేపు తాము అలా చూస్తూ ఉండిపోయామన్నారు.
ప్రధానంగా 30 నుంచి 45 సెకన్ల పాటు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తమ సైన్యంలో ఏర్పడిందన్నారు. తొలుత అణు యుద్ధంగా భావించామని, తర్వాత తేరుకుని మిసైల్‌తో దాడి చేశారనే విషయాన్ని గ్రహించామన్నారు.
‘ భారత్ న్యూక్లియర్ వార్‌హెడ్‌ను భారత్ ఉపయోగించకపోవడంతో వారు మంచి చేశారని నేను చెప్పడం లేదు. మా దేశ ప్రజలు మాత్రం దీనిపై కచ్చితంగా తప్పుగా అర్ధం చేసుకుని ఉంటారు. అది అణు యుద్ధమేనని మా ప్రజలు అనుకుని ఉంటారు. ఒకవేళ అదే జరిగితే తొలి ప్రపంచ న్యూక్లియర్ వార్ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉండేది’ అని రానా సనుల్లాహ్ స్పష్టం చేశారు.
పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీనిలో భాగంగా భారత్ బ్రహ్మోస్ క్షిపణిని కూడా ప్రయోగించింది. ఆ బ్రహ్మోస్ క్షిపణి మెరుపుదాడిలో పాకిస్తాన్‌లో పలు ప్రాంతాలు అతలాకులమయ్యాయి. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ పరిధిలోని పాకిస్తాన్ శాటిలైట్ వ్యవస్థ నాశనమైంది.
పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ ప్రాంతంలో భారత్ దాడి చేయడం ఇది తొలిసారి కాదు. 1971లో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో సైతం నూర్ ఖాన్ ప్రాంతాన్ని భారత్ టార్గెట్ చేసి పాక్‌ను కోలునీయకుండా చేసింది.