భారత్‌కు బాసటగా 40 దేశాలు

Over 40 countries to help India in fight against Covid-19 - Sakshi

అమెరికా నుంచి 10 కోట్ల డాలర్ల విలువైన వైద్య సామగ్రి

రష్యా నుంచి చేరుకున్న 20 టన్నుల పరికరాలు

న్యూఢిల్లీ: కరోనాతో యుద్ధం చేస్తున్న భారత్‌కు 40కి పైగా దేశాలు సాయం అందించడానికి ముందుకు వచ్చాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్‌‡్ష ష్రింగ్లా వెల్లడించారు. ఆయా దేశాల నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లు, ఔషధాలు, వెంటిలేటర్లు, ఇతర సామాగ్రి రానున్నాయని చెప్పారు. రష్యా నుంచి 20 టన్నుల వైద్య సామాగ్రి భారత్‌కు చేరుకున్న నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. వివిధ దేశాల నుంచి 500కి పైగా ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు, 4 వేలకు పైగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 10వేలకు పైగా ఆక్సిజన్‌ సిలండర్లు, 17 క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు, రెమిడెసివర్, ఫెవిపిరావిర్‌ వంటి యాంటీ వైరల్‌ ఇంజెక్షన్లు 8 లక్షల డోసులకుపైగా త్వరలోనే భారత్‌కు చేరుకుంటాయని ఆయన చెప్పారు. గత కొద్ది రోజులుగా రోజుకి 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలన్నీ ఆపన్న హస్తం అందిస్తున్నాయని తెలిపారు.  

అమెరికా: భారత్‌ని ఆదుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా 10 కోట్ల డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని పంపించనున్నట్టు వైట్‌హౌస్‌ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారం రోజుల పాటు విడతల వారీగా ఈ సామగ్రిని పంపనుంది. అమెరికాలో కరోనా విలయతాండవం చేసినప్పుడు భారత్‌ తన శక్తి మేర సాయం అందించిందని , అందుకే అవసరంలో ఉన్న భారత్‌ను తాము ఆదుకుంటామని ఆ ప్రకటన వివరించింది.
అమెరికా నుంచి అందనున్న సాయం  
► వెయ్యి ఆక్సిజన్‌ సిలిండర్లు
► 1.5 కోట్ల ఎన్‌–95 మాస్కులు
► 10 లక్షల ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ కిట్లు  
► 2 కోట్ల ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్‌) టీకా డోసులు  
► ఇప్పటికే తొలి విడత సాయంగా వైద్య పరికరాలను తీసుకొని అమెరికా నుంచి మూడు కార్గో విమానాలు బయల్దేరాయి.  

రష్యా: రష్యా నుంచి 22 టన్నుల వైద్య సామాగ్రి భారత్‌కు చేరుకుంది. రెండు కార్గో విమానాల్లో ఈ సామాగ్రి ఢిల్లీ విమానాశ్రయానికి గురువారం ఉదయం చేరుకున్నట్టుగా భారత్‌లో రష్యా రాయబారి నికోలే కుడాషెవ్‌ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాడిమర్‌ పుతిన్‌ మధ్య టెలిఫోన్‌ చర్చల ఫలితంగా ఆ దేశం తక్షణ అవసరంగా వైద్య సామాగ్రిని పంపింది. ఇందులో 20 ఆక్సిజన్‌ ఉత్పత్తి యూనిట్లు, 75 వెంటిలేటర్లు, 150 మెడికల్‌ మానిటర్స్, 2 లక్షల మందులు ప్యాకెట్లు ఉన్నాయి. బ్రిటన్‌ నుంచి 120 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ భారత్‌కి చేరుకున్నాయి.    
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top