కిమ్‌ వంకరబుద్ధి.. మళ్లీ అమెరికా టార్గెట్‌!.. భారీ మిస్సైల్‌తో బలుపు ప్రకటనలు

North Korean Again Clash With America With Huge Missile Test - Sakshi

ఒకవైపు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని.. ఎలా బయటపడేయాలన్న అంశంపై ఫోకస్‌ పెట్టినట్లు వరుస ప్రకటనలు ఇచ్చుకున్నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌. అయితే అదంతా ఉత్త బిల్డప్‌ అనే విషయం మరోసారి తేటతెల్లమైంది. వద్దని ప్రపంచమంతా వారిస్తున్న ఉన్న నిధులన్నింటిని అణు క్షిపణి ప్రయోగాలకే కేటాయిస్తూ మరోసారి తన వంకర బుద్ధిని చాటుకున్నాడు. 

ఈ ఒక్క నెలలోనే ఏడు మిస్సైల్స్‌ను పరీక్షించగా.. తాజాగా ఉత్తర కొరియా జరిపిన భారీ క్షిపణి ప్రయోగం గురించి ప్రపంచమంతా చర్చ నడుస్తోంది. కారణం.. గత ఐదేళ్లలో నార్త్‌ కొరియా జరిపిన అత్యంత శక్తివంతమైన క్షిపణి పరీక్ష ఇదే కాబట్టి!. క్షిపణి వార్‌హెడ్‌కు ఇన్‌స్టాల్‌ చేసిన కెమెరా స్పేస్‌ నుంచి భూమిని ఫొటోలు తీయగా.. కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ ఆ ఫొటోల్ని సైతం సంబురంగా రిలీజ్‌ చేసింది. 

అయితే పనిలో పనిగా.. అగ్రరాజ్యాన్ని కవ్వించే విధంగా ‍ప్రకటనలు చేసుకుంది. దాదాపు 2వేల కిలోమీటర్ల ఎత్తును చేరుకొని, 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం ఈ క్షిపణి సముద్రంలో కూలింది. అయితే మిడ్‌ రేంజ్‌గా ప్రకటించుకున్నప్పటికీ.. ‘వాసాంగ్‌-12 Hwasong-12 అమెరికా గువాం తీరాన్ని(సుమారు 2,128 మైళ్ల దూరాన్ని) తాకే అవకాశం ఉందని ప్రకటించడం ద్వారా శాంతిచర్చలను పక్కనపడేసి అగ్రరాజ్యంపై కయ్యానికి కాలు దువ్వినట్లయ్యింది. బైడెన్‌ అధికారంలోకి వచ్చాక ఈ స్థాయిలో పరీక్షలు జరపడం గమనార్హం.

అంతర్జాతీయ ఆంక్షలను పట్టించుకోకుండా ప్యోంగ్‌యాంగ్‌ మిలిటరీని శక్తివంతం చేసే దిశగా కిమ్‌ సర్కార్‌ ప్రయత్నాలు ఉధృతం చేస్తోంది. మరోవైపు పొరుగు దాయాది దేశం దక్షిణ కొరియా.. 2017 సమయంలో ఉత్తర కొరియా తీరు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని చెబుతోంది. త్వరలో న్యూక్లియర్‌తోపాటు ఖండాంతర మిస్సైల్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

వాస్తవానికి వాసాంగ్‌-12ను 2017లోనే పరీక్షించినప్పుడు.. గువాం రేంజ్‌కి చేరుతుందని ఉత్తర కొరియా ప్రకటించుకుంది. ఈ తరుణంలో ప్రస్తుతం దాని రేంజ్‌ మరింత పెరిగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఒక దిక్కు చైనాలో వింటర్‌ ఒలింపిక్స్‌, మరోవైపు దక్షిణ కొరియాలో మార్చ్‌లో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఉత్తర కొరియా కవ్వింపులపై అంతర్జాతీయ సమాజం నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ ప్రయోగంపై వైట్‌హౌజ్‌ నుంచి పూర్తిస్థాయి స్పందన రావాల్సి ఉంది.

సంబంధిత వార్త: ఉత్తరకొరియా భారీ క్షిపణి ప్రయోగం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top