
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. సుమారు ఆరేళ్ల తర్వాత.. పొరుగుదేశం చైనాలో ఆయన పర్యటిస్తున్నారు. బీజింగ్‌లో బుధవారం జరగబోయే రెండో ప్రపంచ యుద్ధ వార్షికోత్సవ సైనిక కవాతును ఆయన వీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా 26 దేశాధినేతలు పాల్గొనబోతున్నారు.
కిమ్ జోంగ్ ఉన్ రైలు ప్రయాణం గురించి ప్రపంచం ఇప్పుడు ఆసక్తికరంగా చర్చించుకుంటోంది. 2019లో చైనా, 2023లో రష్యాలో పర్యటించిన టైంలోనూ ఆయన రైలు మార్గం గుండానే ప్రయాణించారు. ఉత్తర కొరియా పాలకులకు ఇలా రైలు ప్రయాణం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. కాదు కాదు ప్రత్యేక కారణాల దృష్ట్యా తప్పడం లేదు!!..

కిమ్ జోంగ్ ఉన్ ప్రయాణించే రైలు మామూలుది కాదు. సుమారు 90 కోచ్‌లు ఉండే ఈ రైలులో కాన్ఫరెన్స్ రూమ్, బెడ్‌రూమ్స్, ఫ్లాట్ స్క్రీన్ టీవీలు, అంతర్జాతీయ వంటకాలు, ఖరీదైన రెడ్ వైన్లు అందుబాటులో ఉంటాయి. రైలు అంతర్గతంగా పింక్ లెదర్ ఆర్మ్‌చైర్లు, జెబ్రా ప్రింట్ డిజైన్, బోర్డో వైన్లు, లాబ్‌స్టర్లు, అంతర్జాతీయ వంటకాలు, కాన్ఫరెన్స్ హాళ్లు, బెడ్‌రూమ్స్‌తో రాజసంగా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చెఫ్‌లు, రెడ్ వైన్లు, నృత్య కళాకారుల బృందం ఆయన వెంట ప్రయాణిస్తారు. అయితే..

అది పూర్తిగా బుల్లెట్‌ప్రూఫ్, బాంబ్‌ప్రూఫ్. ఇది కుటుంబ భద్రతా భయాల కారణంగా ఏర్పడిన సంప్రదాయం. ఈ రైలు వేగం గంటకు 50 కిలోమీటర్లు మాత్రమే. భారీ సాయుధ కవచాలతో నిర్మించబడి ఉండడం వల్ల దీని ప్రయాణం కూడా అంతే భద్రంగా సాగుతుంటుంది. భారీ సాయుధ కవచాలతో నిర్మించబడి ఉండడం వల్ల దీని ప్రయాణం కూడా అంతే భద్రంగా సాగుతుంటుంది. అందుకే.. కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి, తాతల మాదిరిగా విమానాలకంటే రైలు ప్రయాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఈ రైలు కేవలం రవాణా సాధనం కాదు, అది ఒక మొబైల్ కమాండ్ సెంటర్గా పనిచేస్తుంది. ఈ రైలు కోసం అంతర్జాతీయ రక్షణ, రైలు నిర్మాణ నిపుణులు పని చేశారు. ఈ స్థాయి సౌకర్యాలు, భద్రతా వ్యవస్థలు కలిగి ఉండే రైలు నిర్మాణం, నిర్వహణకు సుమారుగా 200–300 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.1,600–రూ.2,400 కోట్లు) వరకు ఖర్చు అయ్యిందనే అంచనా.

పర్యటన ఉద్దేశం..
ఉత్తర కొరియా–రష్యా–చైనా మైత్రి బలోపేతం ద్వారా.. తద్వారా అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా బలమైన సంకేతాలు పంపే ప్రయత్నంగా కిమ్ పర్యటనను విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో చైనా, ఉత్తర కొరియా మధ్య ఆర్థిక, భద్రతా సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందనే చర్చా నడుస్తోంది.