
నేపాల్‌లో యువత ఆందోళనలు, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. గత వారంరోజులుగా సోషల్ మీడియాలో సమాంతరంగా ఇంకో ట్రెండ్ నడుస్తోంది. అదే పొలిటికల్ నెపో కిడ్స్‌కు వ్యతిరేకంగా సాగుతున్న క్యాంపెయిన్. అందుకే పరిశీలకులు.. నేపాల్ ఆందోళలను కేవలం అవినీతి వ్యతిరేక పోరాటంగానే కాకుండా యువత పట్ల గద్దెదిగిన ప్రభుత్వపు నిర్లక్ష్యం, సామాజిక అసమానతలపైనా తిరుగుబాటుగానూ విశ్లేషిస్తున్నారు.
నెపో కిడ్స్.. నేపాల్ జనరేషన్ జెడ్ ఉద్యమానికి కేంద్ర బిందువైందన్న విషయం ఆశ్చర్యం కలిగించేదే. ఒకవైపు దేశంలో యువత నిరుద్యోగం, ఆయా కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతుంటే.. మరోవైపు రాజకీయ నేతల పిల్లలు మాత్రం విలాసాలకు పోయారు. సోషల్ మీడియా అకౌంట్‌లలో.. లక్షల రూపాయల విలువైన దుస్తులు, బ్యాగులు ధరించి ఫోజులు, విదేశీ విహారాలు, విలాసవంతమైన జీవనశైలిని రీల్స్.. ఫొటోల రూపంలో ప్రదర్శించుకున్నారు. ఈ హెచ్చుతగ్గులపై నేతలను నిలదీసేందుకు యువత అదను కోసం ఎదురు చూసింది. అప్పటిదాకా అవినీతిపైనే పోరాటం చేయాలనుకున్న వాళ్లకు.. సరిగ్గా ఆ సమయంలో సోషల్ మీడియా బ్యాన్ రూపంలో ఓ ఆయుధం దొరికినట్లయ్యింది.
నేపాల్ ఆందోళనలతో అక్కడి యువతకు నెపో కిడ్స్ వ్యవహారాన్ని ప్రశ్నించేందుకు సరైన సమయం దక్కింది. తొలుత అందుబాటులో ఉన్న టిక్‌టాక్ లాంటి కొద్ది ప్లాట్‌ఫారమ్‌లలో వాళ్ల లైఫ్‌స్టైల్‌ను ఏకిపారేశారు. బ్యాన్ ఎత్తేశాక.. ఇన్‌స్టాగ్రామ్, రెడ్డిట్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. అలా.. #NepoBabiesNepal అనే హ్యాష్‌ట్యాగ్ మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది.

ఈ జాబితాలో.. మాజీ మిస్ నేపాల్, మాజీ ఆరోగ్య మంత్రి కుమార్తె శ్రింఖల ఖటీవాడ, సింగర్.. మాజీ ప్రధాని షేర్ బహాదూర్ డెఉబా కోడలు శివానా శ్రేష్ఠ, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహాల్ "ప్రచండ" మనవరాలు స్మితా దహాల్, గండకి ప్రావిన్స్‌కు మాజీ మంత్రి బిందు కుమార్ థాపా కొడుకు సౌగత్ థాపాలు.. ఇలా మరికొందరిని తెరపైకి తెచ్చారు. అక్కడి కరెన్సీ ప్రకారం.. వీళ్లు వాడే వస్తువులు అత్యంత ఖరీదైనవే కావడంతో యువతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది.

వాళ్ల ఒంటి మీద దుస్తుల దగ్గరి నుంచి, వాళ్లు వాడే కార్లు, బ్యాగులు, పర్‌ఫ్యూములు, చివరకు ఆహార విషయంలోనూ ప్రదర్శించే విలాసాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాళ్ల వాళ్ల నివాసాలపై దాడులు చేసినప్పుడు ఆ లగ్జరీ వస్తువుల్ని కొందరు ఎత్తుకెళ్లిపోయారు. మరికొందరు ఆకతాయిలు ఆ లగ్జరీ గూడ్స్‌ను చూపిస్తూ.. ‘‘చూడడానికి రెండు కళ్లు చాలడం లేదంటూ’’ సెటైర్లు వేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

ఈ పరిణామాలతో కొందరు తమ అకౌంట్లను, పేజీలను క్లోజ్ చేసేశారు. మరికొందరు పోస్టులు చేయకుండా ఉండిపోయారు. దాడులు చేస్తారనే భయంతో.. ఈ తరహా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో నేతల పిల్లల ఆస్తులపైనా దర్యాప్తు జరిపించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

అలా మొదలై..
అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత.. ముఖ్యంగా Gen Z చేపట్టిన ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది. పోలీసుల వల్ల కాకపోవడంతో అక్కడి ప్రభుత్వం నిరసనలను అణచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇది హింసాత్మకంగా మారడంతో.. 31 మంది ఆందోళనకారులు మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిణామం.. జెన్‌జెడ్‌కు మరింత ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వం గద్దె దిగిపోవాలన్న నినాదంతో.. కేబినెట్ మంత్రులు, మాజీ నేతల ఇళ్లపై దాడులకు దిగి తగలబెట్టారు. దొరికిన వాళ్లను దొరికినట్లు చితకబాదారు. దీంతో.. కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
రాజకీయ సంక్షోభం తలెత్తినవేళ.. పరిస్థితి అదుపు తప్పకూడదనే ఉద్దేశంతో సైన్యం రంగంలోకి దిగింది. రాజధాని ఖాట్మండు సహా ప్రధాన నగరాల్లో కర్ఫ్యూలు విధించి పహారా కాస్తోంది. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఉద‍్యమకారుల నేతలకు మధ్య ఉండి ప్రభుత్వ ఏర్పాటు చర్చలను సైన్యమే ముందుకు తీసుకెళ్తోంది. రాజ్యాంగాన్ని తిరగరాసి సుపరిపాలన దిశగా అడుగు పడాలని, గత మూడు దశాబ్దాలుగా పాలకులు పాల్పడిన అవినీతిపై విచారణకు జరిపించాలని, అలాగే పోరాటంలో మరణించిన వాళ్లను అమరవీరులుగా గుర్తించి వాళ్ల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని జెన్‌జెడ్ యువత డిమాండ్లు చేస్తుండడం తెలిసిందే.
పేదల బతుకులు చీకట్లతో తడిసిన వేళ..
వెలుగుల్లో నేతల వారసులు విలాసాలు ఆరబోశారు!
ఆవేదన అగ్గిలా మారి.. సమానత్వం కోసం గళం విప్పింది
ఇక చాలు!" అని యువత నినదించగా.. పాలకుల పీఠాలు ఖాళీ అయ్యాయి.
ఇది నేపాల్ ఉద్యమం కాదు.. అక్కడి ఒక తరం గుండె చప్పుడు