
హింసాత్మక ఘటనల్లో 30కి పెరిగిన మరణాల సంఖ్య
1,033 మందికి గాయాలు
సైన్యం పహారాలో కొనసాగుతున్న కర్ఫ్యూ
యాత్రలకు వెళ్లి నేపాల్‌లో చిక్కుకుపోయిన వందలాది మంది భారతీయులు
బద్దలైన జైళ్లు... పారిపోయిన 13,000 మంది ఖైదీలు
ఆర్మీ, జెన్ జెడ్ మధ్య ముగిసిన తొలిదఫా చర్చలు
కాఠ్మండు/న్యూఢిల్లీ/డెహ్రాడూన్/జైపూర్: హిమాలయాల నేపాల్‌లో సోషల్‌మీడియాపై నిషేధంతో శాంతియుతంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం ఉగ్రరూపం దాల్చి డజన్లమందిని పొట్టనబెట్టుకుని బుధవారానికి చాలామటుకు శాంతించింది. కానీ బయటిశక్తుల విధ్వంసకర ఉద్యమ ఎగబోతతో నివురుగప్పిన నిప్పులా తయారై తాత్కాలిక ప్రభుత్వానికి కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. దాంతో సైన్యంరంగంలోకి దిగి దేశవ్యాప్త కర్ఫ్యూను కఠినంగా అమలుచేస్తోంది.
ఉద్యమబాట వీడి చర్చల పథంలో సాగాలంటూ విద్యార్థి సంఘాలకు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌదెల్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ‘జెన్ జెడ్ నేపాల్’విద్యార్థి సంఘం ప్రతినిధులు నేపాల్ సైన్యంతో బుధవారం తొలిదఫా చర్చలు జరిపారు. రెండు గంటలపాటు చర్చించినా ఎలాంటి ఏకాభిప్రాయం కుదర్లేదు. మరోమారు చర్చలు జరపనున్నారు.
నేపాల్ మాజీ మహిళా చీఫ్ జస్టిస్ సుశీల కరీ్క, కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా, మాజీ విద్యుత్ బోర్డ్ సీఈఓ కుల్మాన్ ఘిసింగ్‌లలో ఏవరో ఒకరి సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని విద్యార్థులు డిమాండ్‌చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వదేశాన్ని నిరసనోద్యమ అగి్నకీలల్లోకి తోసేశారన్న ఆరోపణలను విద్యార్థులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. శాంతియుతంగా పోరాటంచేస్తుంటే బయటిశక్తులు దూరి విధ్వంసం సృష్టించాయని స్పష్టంచేశాయి.
ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసినా ఆందోళనలు చల్లారకపోవడంతో సైన్యం మంగళవారం అర్థరాత్రి రంగంలోకి దిగింది. అత్యంత సమస్యాత్మకంగా మారిన ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. దేశవ్యాప్త కర్ఫ్యూను విధించింది. అయితే హింసాత్మక ఘటనల్లో మరణాల సంఖ్య బుధవారానికి 33కు పెరిగింది. 1,033 మంది గాయపడ్డారు. గురువారం ఉదయం దాకా కఠిన ఆంక్షలను అందరూ పాటించాలని, లూటీ, దోపిడీ వంటివి పునరావృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
యాత్ర, పర్యటన కోసమొచ్చి చిక్కుకుపోయిన విదేశీయులను భద్రంగా స్వదేశాలకు తరలించే ప్రక్రియ మొదలెడతామని ఆర్మీ భరోసా ఇచ్చింది. ఆలోపు విదేశీ పర్యాటకులు, యాత్రికులకు తగు సాయం చేయాలని హోటళ్లు, టూరిజం సంస్థలను ఆర్మీ ఆదేశించింది. కాఠ్మండులో దుకాణాలు కొల్లగొట్టిన అల్లరిమూకల సభ్యులను ఆర్మీ అరెస్ట్‌చేసింది. వారి నుంచి భారీ ఎత్తున నగదు, 31 ఆయుధాలు, విలువైన వస్తువులను స్వా«దీనంచేసుకుంది. నేపాల్‌లో తాజా పరిస్థితిని గమనిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ బుధవారం చెప్పారు.
పారిపోయిన ఖైదీలు
ఆందోళనకారులు జైళ్లను బద్దలుకొట్టడంతో వాటిల్లోని 13,000 మందికిపైగా ఖైదీలు పరారయ్యారు. ఢిల్లీబజార్ జైలు, ఛిత్వాన్, నఖూ, ఝుంప్కా, కంఛన్‌పూర్, జలేశ్వర్, కస్కీ, డాంగ్, జుమ్లా, సోలూఖుంబు, గౌర్, బజ్హాంగ్‌లోని జైళ్ల నుంచి ఖైదీలు పారిపోయారు. ఆకొద్ది సమయంలో పారిపోవడం సాధ్యంకాని ఖైదీలు కారాగారాల్లో ఘర్షణలకు దిగుతున్నారు. పశ్చిమ నేపాల్‌లోని బాంకే ప్రాంతంలోని నౌబస్తా ప్రాంతీయ జైలు పరిధిలోని బాలనేరస్తుల కేంద్రంలో కొందరు జైలువార్డన్ల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు తెగించారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు బాలలు చనిపోయారు. కొన్ని జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలను సైన్యం ఎలాగోలా వెతికి పట్టుకుని మళ్లీ జైల్లో పడేసింది.
పర్యాటకుల ఆక్రందనలు
పొఖారా పట్టణంలో వాలీబాల్ లీగ్ మ్యాచ్‌ల కోసం వచి్చన భారతీయ మహిళ ఉపస్థ గిల్ ఆందోళనకారుల దాడి నుంచి తప్పించుకున్నారు. తనను రక్షించాలని, స్వదేశానికి పంపించాలని భారతసర్కార్‌ను వేడుకుంటూ ఆమె ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్‌చేశారు. ‘‘మ్యాచ్ కోసం ఇక్కడికొచ్చా. హోటల్ స్పాలో ఉన్నప్పుడు ఆందోళనకారులు పెద్ద కర్రలతో వెంటబడ్డారు. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్నా. కానీ నా లగేజీ మొత్తం హోటల్‌లోనే ఉండిపోయింది. ఆ హోటల్‌కు నిరసనకారులు నిప్పుపెట్టి కాల్చేశారు. దయచేసి నన్ను భారత్‌కు పంపేయండి. రోడ్ల మీద ఎక్కడ చూసిన మంటలే చెలరేగుతున్నాయి. ఇక్కడ దారుణ పరిస్థితులున్నాయి’’అని ఆమె వీడియోలో వాపోయారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇలా పలు రాష్ట్రాలకు చెందిన చాలా మంది పర్యాటకులు నేపాల్‌లో చిక్కుకుపోయి సురక్షిత తిరుగుప్రయాణం కోసం ప్రభుత్వ సాయం అర్థిస్తున్నా రు. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే నేపా ల్ అధికారవర్గాలతో చర్చలు జరుపుతున్నాయి. అయితే ఎయిర్‌ఇండియా, ఇండిగో విమానాల్లో భారతీయులను వెనక్కి రప్పిస్తామని పౌరవిమాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.