పరస్పర సహకారంతోనే విపత్తులపై విజయం

Narendra Modi says cooperation must for ensuring resilience of global system - Sakshi

ఈ ఏడాది కరోనా నుంచి ప్రపంచం కోలుకుంటుంది

‘ఐసీడీఆర్‌ఐ–2021’లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ/లండన్‌: విపత్తులను ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం కచ్చితంగా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, షిప్పింగ్‌ లైన్లు, వైమానిక నెట్‌వర్క్స్‌ వంటివి ప్రపంచమంతటా విస్తరించి ఉంటాయని వెల్లడించారు. ఎక్కడైనా విపత్తు సంభవిస్తే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వెంటనే కనిపిస్తుందన్నారు. విపత్తుల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతులను పునరుద్ధరించడానికి, పూర్వ స్థితికి తీసుకురావడానికి అన్ని దేశాలు కలిసి పని చేయాలని సూచించారు. డిజాస్టర్‌ రిసైలియెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే అంశంపై బుధవారం జరిగిన అంతర్జాతీయ సదస్సు (ఐసీడీఆర్‌ఐ–2021) ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. భారత్‌లాంటి దేశాలు మౌలిక వసతుల రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. విపత్తుల నుంచి కోలుకోవడానికి కూడా నిధుల కేటాయింపులు అవసరమన్నారు.

కరోనా నేర్పిన పాఠాలు మరవొద్దు
కోవిడ్‌–19 మహమ్మారి ఒక ఊహించని విపత్తు అని నరేంద్ర మోదీ అభివర్ణించారు. వందేళ్లకు ఒకసారి సంభవించే ఇలాంటి విపత్తుకు మనం సాక్షీభూతంగా నిలిచామన్నారు. ఈ మహమ్మారి వల్ల పేద–ధనిక, తూర్పు–పడమర, ఉత్తరం–దక్షిణం అనే తేడా లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలూ నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకచోట మొదలైన విపత్తు ప్రపంచాన్ని ఎంతో వేగంగా ప్రభావితం చేస్తుందన్న పాఠాన్ని కరోనా వైరస్‌ మనకు నేర్పిందన్నారు. ఉమ్మడి శత్రువును ఎదిరించడానికి ప్రపంచమంతా ఒక్కతాటిపైకి ఎలా రావాలో తెలియజేసిందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలు ప్రపంచంలో ఎక్కడైనా పురుడు పోసుకోవచ్చని వివరించారు. 2021లో కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం వేగంగా కోలుకుంటుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా నేర్పిన పాఠాలను మర్చిపోవద్దని సూచించారు. ఈ పాఠాలను ప్రజారోగ్య విపత్తులకే కాకుండా ఇతర విపత్తులకు కూడా అన్వయించుకోవాలని పిలుపునిచ్చారు. ఆధునిక ప్రపంచం పాలిట పెనుభూతంగా మారిన వాతావరణ మార్పుల నుంచి గట్టెక్కడానికి ఉమ్మడి కృషి కావాలని ప్రధానమంత్రి మోదీ సూచించారు. ఈ సదస్సులో ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ, యూకే ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తదితరులతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల, విద్యా సంస్థల  ప్రతినిధులు, పలువురు నిపుణులు పాల్గొన్నారు.

మోదీ పాత్ర ప్రశంసనీయం
వాతావరణ మార్పులపై జరుగుతున్న అంతర్జాతీయ పోరాటంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ప్రశంసించారు. ఆయన నాయకత్వం విస్మరించలేనిదని అన్నారు. తాను వచ్చే నెలలో భారత్‌లో పర్యటించబోతున్నానని, వాతావరణ మార్పులతోపాటు ఇతర కీలక అంశాలపై తన మిత్రుడు మోదీతో చర్చిస్తానని చెప్పారు. ఐసీడీఆర్‌ఐ సదస్సులో బోరిస్‌ జాన్సన్‌ మాట్లాడారు. ఈ సదస్సును నిర్వహించిన నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top