బ్యాంకాక్: ఈశాన్య మయన్మార్‌లో ఆదివారం మధ్యాహ్నం ఓ భవనంలో ఘోర పేలుడు ప్రమాదం సంభవించింది. గనుల తవ్వకాల కోసం నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘోర ప్రమాదంలో మరో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది, స్థానిక మీడియా వెల్లడించాయి. చైనా సరిహద్దుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామ్‌ఖామ్ పరిధిలోని ‘కౌంగ్‌టుప్’ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల సమయంలో ఈ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రాంతం ప్రస్తుతం మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ‘తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ’ అనే సాయుధ తిరుగుబాటు ముఠా ఆధీనంలో ఉంది.
వందకు పైగా ఇళ్లు ధ్వంసం
ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. పేలుడు ధాటికి ఆకాశంలోకి దట్టమైన పొగ మేఘాలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్.. ఆదివారం సాయంత్రానికి ఆరుగురు చిన్న పిల్లల మృతదేహాలతో సహా మొత్తం 46 మృతదేహాలను వెలికితీసి అంత్యక్రియల కోసం తరలించారు. గాయపడిన మరో 74 మందిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు తీవ్రత వల్ల చుట్టుపక్కల ఉన్న దాదాపు 100కు పైగా నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంపై తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ తమ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా స్పందించింది. గనులు, క్వారీ తవ్వకాల కోసం తమ ఎకనామిక్ డిపార్ట్‌మెంట్ ఈ భవనంలో ‘జెలిగ్నైట్’ అనే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిందని స్పష్టం చేసింది.
సాధారణంగా జెలిగ్నైట్‌ను రాళ్లు బద్దలు కొట్టడానికి వాడతారు. అయితే దీనిని ఎక్కువ కాలం పాటు సరిగ్గా నిల్వ చేయకపోతే ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతం ఈ పేలుడు ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు స్థానిక యంత్రాంగం వైద్య సహాయం, పునరావాస చర్యలను అందిస్తోంది.
🇲🇲: At least 55 people were killed and over 60 injured in a massive explosion at a gelignite explosives warehouse in Kaungtup village, Namhkam township, Shan State, Myanmar, on May 31, 2026.
The blast, at a site controlled by the Ta'ang National Liberation Army for mining use,… https://t.co/x42YI8XkRw— World In Last 24hr (@world24x7hr) May 31, 2026


