
డమాస్కస్: అసద్ నిరంకుశ పాలనకు తెరదించిన హయత్ తహ్రీర్ అల్ షామ్, ఇతర తిరుగుబాటుదారుల గ్రూప్‌లు ఆపద్ధర్మ ప్రధానిగా మొహమ్మద్ అల్ బషీర్‌ను నియమించారు. 2025 మార్చి ఒకటో తేదీదాకా ఈయన తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగుతారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు.
సిరియాలో శాంతిభద్రతలు నెలకొనడానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కొత్త ప్రభుత్వంలో సభ్యులతో కలిసి మంగళవారం డమాస్కస్‌లో సమావేశం నిర్వహించిన ఆయన... తిరుగుబాటు అనంతరం శాఖలు, సంస్థల బదిలీలపై చర్చించారు. రాబోయే రెండు నెలలు సిరియా ప్రజలకు సేవలందించడానికి, సంస్థలను పునఃప్రారంభించడానికి సమావేశాలు నిర్వహించామని బషీర్ వెల్లడించారు. మైనారిటీలను గౌరవిస్తూ ప్రజాస్వామిక రీతిలో నడిచినంత కాలం సిరియా ప్రభుత్వానికి అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని ఆదేశ విదేశాంగ మంత్రి చెప్పారు.