
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. భవనాలు తీవ్రంగా ఊగిపోయాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌స్కేల్‌పై భూకంపం తీవ్రత 7.8గా నమోదు అయింది. దీంతో యూఎస్ జాతీయ ఆరోగ్య సర్వీస్ విభాగం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాణ, ఆస్తి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది.
పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్‌స్కీ రీజియన్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కేంద్రం 10 కి.మీ దూరంలో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అనంతరం స్వల్ప వ్యవధిలో మరో ఐదుసార్లు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
రష్యాలో తరచూ భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం—అది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ (Pacific Ring of Fire) లో భాగంగా ఉండటం. ఇది భూమి మీద అత్యంత చురుకైన భూకంప, అగ్నిపర్వత ప్రాంతం. ప్రధానంగా కమ్చట్కా ద్వీపకల్పం ప్రాంతం పసిఫిక్ ప్లేట్-యూరేషియన్ ప్లేట్ మధ్య ఉంది. ఇవి ఒకదానిని మరొకటి గుద్దుతూ కదలడం వల్ల భూకంపాలు ఏర్పడతాయి.
ఇదిలా ఉంటే.. ఇటు ఇండోనేషియాలోనూ 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. సెంట్రల్ పపువా ప్రావిన్స్‌లో శుక్రవారం వేకువ జాము సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 28 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని సమాచారం.