కెనడాలో పరిశోధకులు గడ్డకట్టిన మలంలో మామత్‌ల డీఎన్‌ఏను గుర్తించారు. ఉడుత బిలం (ఉడుత నేలలో తొవ్వితే ఏర్పడిన చిన్న గుహలాంటి నివాస స్థలం) దానిని వేల ఏళ్ల పాటు కాపాడింది. అంతరించిపోయిన రోమాలతో కూడిన మామత్‌లతో పాటు ఇతర జంతువుల ప్రాచీన డీఎన్‌ఏ రూపంలో అత్యంత విలువైన శాస్త్రీయ సమాచారాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కెనడా శాశ్వత మంచు నేలలో భద్రంగా ఉన్న ఉడుతల విసర్జనలో దానిని కనుగొన్నారు.
ఆర్కిటిక్ గ్రౌండ్ స్క్విరెల్ అనే ఉడుత జాతి అత్యంత చల్లని ప్రాంతాల్లో, మంచుతో కప్పిన ప‍్రదేశాల్లో జీవిస్తుంది. ఈ ఉడుత సాధారణంగా మనం చెట్లపై చూసే ఉడుత కాదు. ఇది కెనడా, అలాస్కా, ఆర్కిటిక్ ప్రాంతాల్లో నివసిస్తుంది. బిలాలు తవ్వుకుని జీవిస్తుంది. ఏడాదిలో సుమారు 7 నుంచి 8 నెలలు శీతనిద్రలో ఉంటుంది. బయట ఉష్ణోగ్రత -30°C కంటే తక్కువగా ఉన్నా బతికే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆహారాన్ని బిలాల్లో నిల్వ చేస్తుంది. మంచు నేల (పర్మాఫ్రాస్ట్) ఆ బిలాన్ని వేల ఏళ్ల పాటు భద్రపరచింది.
గాలి చొరబడని విధంగా మూసివేసిన బిలాల్లో ఉన్న ప్రాచీన మామత్ డీఎన్‌ఏ కొన్ని వేళ ఏళ్ల నాటి కాలానికి చెందినది. కెనడా వాయవ్య ప్రాంతంలోని విశాల అరణ్య ప్రాంతం యూకాన్‌లో వేల ఏళ్ల పరిణామ క్రమంపై అవగాహనను దీని ద్వారా పొందవచ్చు. రోమాలతో కూడిన మామత్ డీఎన్‌ఏతో పాటు తోడేళ్లు, అడవి ఎద్దులు, గుర్రాలు, చిరుతలు, వందలాది మొక్కలకు చెందిన జన్యు పదార్థాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు.
‘‘సాధారణంగా ప్రజలు మామత్ దంతం వంటి పెద్ద శిలాజాలను కనుగొనడాన్ని గొప్ప విషయంగా భావిస్తారు. కానీ, ఉడుతల మలాన్ని పరిశీలించడం సాధారణంగా అంత ప్రాముఖ్యంగా కనిపించదు. అయినప్పటికీ, ఆ మలం నుంచే శాస్త్రవేత్తలకు అమూల్యమైన డీఎన్‌ఏ సమాచారం లభించింది’’ అని అధ్యయన ప్రధాన రచయిత, కెనడాలోని మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పాలియోజీనోమిక్స్ శాస్త్రవేత్త టైలర్ మర్చీ తెలిపారు. పాలియోజీనోమిక్స్ అంటే ప్రాచీన జీవుల జన్యు సమాచారాన్ని అధ్యయనం చేసే శాస్త్ర విభాగం.
అధ్యయనం ప్రకారం.. మొదట ఉడుత సూక్ష్మజీవ సముదాయాన్ని మాత్రమే అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావించారు. అనంతరం నిజంగా ఆశ్చర్యపరిచే జీవ వైవిధ్యాన్ని గుర్తించారని మర్చీ చెప్పారు. ఈ ఎలుక జాతి జీవులకు ఆహారం, గింజలు, ఆకులు, ఎముకలు వంటి వస్తువులను బిలాల్లో నిల్వ చేసుకునే అలవాటు ఉండడమే ఇందుకు కారణమని తెలిపారు.
బిలాలను మంచు నేల మూసేయడంతో
ఆర్కిటిక్ ఉడుతలు ఏడాదిలో కేవలం 4 నెలలు మాత్రమే చురుకుగా ఉంటాయి. మిగతా సమయం శీతనిద్రలో గడుపుతాయి. అంటే తమ శరీర కార్యకలాపాలను చాలా వరకు తగ్గించుకుని, దీర్ఘకాలం నిద్రలాంటి స్థితిలో ఉంటాయి.
అందుకే ఉడుతలు తమ బిలాలను కాయలు, గింజలు, ఆకులు, ఎముకలు, దొరికిన ఇతర వస్తువులతో నింపుతాయి. కాలక్రమంలో కొన్ని బిలాలను శాశ్వత మంచు నేల మూసివేసింది. ఆ ఉడుతల బిలాలు వేల ఏళ్ల క్రితం ఉన్న వస్తువులు, మలం, మొక్కల అవశేషాలు, జంతువుల డీఎన్‌ఏ వంటి వాటిని యథాతథంగా భద్రపరిచాయి. అందువల్ల అవి గత కాలానికి చెందిన సమాచారాన్ని మనకు అందించే నిల్వ కేంద్రాలుగా మారాయి.
శాస్త్రవేత్తలు పూర్తిగా గడ్డకట్టిన చిన్న గ్రౌండ్ స్క్విరెల్ నమూనాను కూడా గుర్తించారు. “అది ఒక కాలం పాటు నిద్రపోయి మళ్లీ ఎప్పుడూ మేల్కోలేదు... అటు వెళ్తున్న ఒక శాస్త్రవేత్త దానిని గుర్తించాడు” అని శాస్త్రవేత్త టైలర్ మర్చీ చెప్పారు.
మామత్‌ను తిరిగి జీవంలోకి..!
అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ కొలోసల్ బయోసైన్సెస్ 4,000 ఏళ్ల క్రితం అంతరించిపోయిన రోమాలతో కూడిన మామత్‌ను తిరిగి జీవంలోకి తీసుకురావాలనే ఉద్దేశాన్ని ఇటీవల ప్రకటించింది.
అయితే నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఏర్పడే జంతువు మామత్ కంటే, మామత్‌ను పోలి ఉండేలా జన్యు మార్పులు చేసిన ఆసియా ఏనుగును ఎక్కువగా పోలి ఉంటుందని వారు భావిస్తున్నారు.
మర్చీ బృందం ప్రస్తుతం మరో అధ్యయనంపై పని చేస్తోంది. ఉడుతల మలంలో లభించిన డీఎన్‌ఏ రోమాలతో కూడిన మామత్ పరిణామ క్రమంపై ఏమి వెల్లడిస్తుందో ఆ అధ్యయనం వివరిస్తుంది.


