‘ఆర్‌సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో భాగమే’ | RCB Ownership Change Vijay Mallya Says RCB Will Always Be in My DNA | Sakshi
Sakshi News home page

‘ఆర్‌సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో భాగమే’

Mar 26 2026 1:34 PM | Updated on Mar 26 2026 1:42 PM

RCB Ownership Change Vijay Mallya Says RCB Will Always Be in My DNA

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) చరిత్రలో అత్యంత ఆదరణ కలిగిన ఫ్రాంచైజీల్లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) యాజమాన్యం మారిన నేపథ్యంలో ఆ జట్టు వ్యవస్థాపక యజమాని విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సుమారు రూ.16,500 కోట్లకు ఈ ఫ్రాంచైజీ విక్రయించిన తర్వాత మాల్యా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ‘ఆర్సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో భాగం’ అని పేర్కొన్నారు.

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు మాల్యా ఈ ఫ్రాంచైజీని రూ.450 కోట్లకు (సుమారు 111.6 మిలియన్ డాలర్లు) దక్కించుకున్నారు. ఆ సమయంలో తన నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘నేను 2008లో ఈ జట్టును కొనుగోలు చేసినప్పుడు చాలా మంది నన్ను చూసి నవ్వుతూ ఇది కేవలం ఒక ‘వానిటీ ప్రాజెక్ట్’(ప్రదర్శన కోసం చేసే ఖర్చు) అని విమర్శించారు. కానీ నా లక్ష్యం స్పష్టంగా ఉంది. రాయల్ ఛాలెంజ్ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయడమే నా ఉద్దేశం. అందుకే జట్టుకు ఆ పేరు పెట్టాను. ఈ రోజు ఆర్‌సీబీ అత్యంత విలువైన ఫ్రాంచైజీగా నిలవడం గర్వంగా ఉంది’ అని మాల్యా ఎక్స్‌ (ట్విట్టర్)లో రాశారు.

కోహ్లీ ఎంపికే నా విజయం!

ప్రపంచ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం తన అత్యుత్తమ నిర్ణయమని మాల్యా అభివర్ణించారు. 18 ఏళ్ల క్రితం ఒక కుర్రాడిగా కోహ్లీని గుర్తించి జట్టులో చేర్చుకున్న జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. కోహ్లీతో పాటు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలను జట్టులోకి తీసుకురావడం తన అదృష్టమని పేర్కొన్నారు.

నూతన యాజమాన్యం

ఇటీవలే ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం (టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బ్లాక్ స్టోన్, బోల్ట్ వెంచర్స్) రూ.16,660 కోట్లకు ఆర్‌సీబీని కైవసం చేసుకుంది. కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ విక్రమ్ బిర్లా ఇకపై ఈ ఫ్రాంచైజీకి సారథ్యం వహించనున్నారు. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ తన ప్రధాన వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు ప్రాంఛైజీలోని తన వాటాను విక్రయించినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement