రెండు గంటలుగా అపస్మారక స్థితిలో మహిళ.. కాపాడేందుకు డోర్ పగలగొట్టి వెళ్లిన పోలీసులు.. తీరా చూసి షాక్‌..! 

London Police Break Into Gallery Find Distressed Woman Art - Sakshi

లండన్‌: ఓ మహిళ కుర్చీలో కూర్చొని టేబుల్‌పై తలెపెట్టి రెండు గంటలుగా అపస్మారక స్థితిలో ఉంది. రోడ్డుపై వెళ్లే ఓ వ్యక్తి ఆమెను గమనించి వెంటనే పోలీసులకు సమచారం అందించాడు. దీంతో హుటాహుటిన అక్కడకు వెళ్లిన పోలీసులు ఆ మహిళను కాపాడేందుకు డోర్లు పగలగొట్టారు. దగ్గరకు వెళ్లి ఆమెను చూశాక షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె మహిళ కాదు.. ఓ కళాకారుడు చెక్కిన శిల్పం. అసలు విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ఆర్ట్ గ్యాలరీలో ఉన్న ఆ బొమ్మ అచ్చం నిజమైన మహిళ లాగానే ఉండటం చూసి నమ్మలేకపోయారు.

పసుపు రంగు స్వెటర్, నల్ల రంగు ప్యాంటు వేసుకున్న ఈ బొమ్మను చూస్తే ఎవరైనా నిజంగా మహిళే అనుకుంటారు. లండన్‌ సోహోలోని లాజ్ ఎంపోరియం ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచిన ఈ శిల్పాన్ని అమెరికాకు చెందిన ఓ శిల్పి చెక్కాడు. ప్యాకింగ్ టేప్, ఫోమ్‌ను ఉపయోగించి ఈ బొమ్మను తీర్చిదిద్దాడు. గ్యాలరీ ఓనర్ స్టీవ్ లాజారైడ్స్ దీన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈ బొమ్మకు క్రిస్టినా అనే పేరు కూడా పెట్టారు.

అయితే నవంబర్ 25న ఎంపోరియంలో పనిచేసే మహిళ  గ్యాలరీకి తాళం వేసి టీ పెట్టుకునేందుకు పైకి వెళ్లింది. ఈ సమయంలోనే ఓ వ్యక్తి బొమ్మను చూసి అమ్మాయి అనుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వాళ్లు వచ్చి డోర్‌ను పగలగొట్టారు. టీ కోసం పైకి వెళ్లిన మహిళ.. శబ్దాలు విని కిందకు వచ్చింది. పోలీసులను చూసి అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక షాక్ అయింది. 

గతంలోనూ ఓసారి ఈ బొమ్మను చూసి నిజమైన మహిళ అనుకుని వైద్య విద్యార్థులు సాయం చేసేందుకు ప్రయత్నించారు. తీరా అది శిల్పం అని తెలిసి నవ్వుకున్నారు.
చదవండి: 165 ఏళ్లనాటి జీన్స్‌.. జస్ట్‌ రూ.94 లక్షలే

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top