Valentines Day: ప్రతి నెల 14న ప్రేమికుల రోజు జరుపుకొనే దేశమేదో తెలుసా?

Koreans Celebrate Valentines Day Every Month - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు 'ఫిబ్రవరి 14'వ తేదీనే ఎంచుకుంటారు. ఎందుకంటే ఈ రోజు చరిత్రలో ఎంతో ప్రత్యేకం. నిజమైన ప్రేమకు గుర్తుగా  దీన్ని ప్రేమికుల రోజుగా ఏటా జరుపుకొంటారు. 

అయితే ప్రపంచం మొత్తం ఒక్కరోజే వాలెంటైన్స్‌ డేను జరుపుకొంటే కొరియాలోని యువత మాత్రం ప్రతి నెల 14వ తేదీని ప్రేమికుల రోజుగానే జరుపుకొంటారు. ఇలా మొత్తం ఏడాదిలో 12 రోజులు తమ ప్రియమైన వారికి కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. మరి ఆ 12 రోజుల ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం...

డైరీ డే (జనవరి 14)
దక్షిణ కొరియాలో జనవరి 14ను 'డైరీ డే'గా జరుపుకొంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు, స్నేహితులు,  ఈరోజున కొత్త డైరీలను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త ఏడాది తర్వాత డైరీ డే రావడంతో వ్యాపారులు కూడా ఆకర్షణీయంగా వీటిని రూపొందించి విక్రయిస్తారు. మరొకొందరు ఈ రోజును 'క్యాండిల్ డే'గా జరుపుకొంటారు. అలంకరించిన క్యాండిల్స్‌ను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు.

వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14)
ప్రపంచంలోని అన్ని దేశాల్లాగే ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకొంటారు కొరియా యువత. అయితే వీళ్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రోజు అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలకు చాక్లెట్లను కానుకగా ఇస్తుంటారు. అబ్బాయిలు రిటర్న్ గిఫ్ట్‌గా ఏమీ ఇవ్వకూడదు. ఇది వీళ్ల సాంప్రదాయంగా కొనసాగుతోంది. అందుకే కొరియా వ్యాపారులు ఈరోజు రకరకాల చాక్లెట్లను ప్రదర్శిస్తూ యువతను ఆకర్షిస్తుంటారు.

వైట్ డే (మార్చి 14)
వాలెంటైన్స్ డే తర్వాత వచ్చే 'వైట్ డే' కొరియాలో చాలా స్పెషల్. ప్రేమికుల రోజు తమ ప్రేయసి నుంచి చాక్లెట్లు కానుకగా అందుకున్న అబ్బాయిలు.. వైట్‌ డే రోజు వాళ్లకు రిటర్న్ గిఫ్టులు ఇస్తారు. తెల్లరంగు చాక్లెట్లనే ఇవ్వడం వల్ల ఈ రోజుకు వైట్ డే అని పేరు పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో తెల్లరంగుతో పాటు నల్లరంగు చాక్లెట్లను కూడా రిటర్న్‌ గిఫ్టులుగా ఇవ్వడం అలవాటైంది. అయితే అమ్మాయిలు వాలెంటైన్స్ డే రోజు ఒక్క చాక్లెట్ గిఫ్ట్‌గా ఇస్తే.. అబ్బాయిలు మాత్రం రిటర్న్‌గా మూడు గిఫ్టులు ఇస్తారు. వైట్ చాక్లెట్‌తో పాటు క్యాండీస్, లాలీపప్‌లను కలిపి ఇస్తుంటారు. 

బ్లాక్ డే (ఏప్రిల్ 14)
వాలెంటైన్స్ డే, వైట్‌ డే రోజున ఎలాంటి కానుకలు రాని యువత బ్లాక్‌ డేను జరపుకొంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది సింగిల్స్ డే. తమకు ప్రేమ ప్రపోజల్ రాని యువతీయువకులు ఈ రోజు కలిసి బ్లాక్ నూడుల్స్ తింటారు. సింగిల్స్ మీటింగ్‌గా చెప్పుకునే బ్లాక్‌ డే రోజున తమను ప్రేమించేవారు లేరని యువత కాస్త ఒత్తిడికి గురవుతారు.

ఎల్లో డే (మే 14)
ఈ రోజున ప్రేమికులు, దంపతులు పుసుపు రంగు పూలను ఇచ్చిపుచ్చుకుంటారు. తమ ప్రియమైన వారితో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేస్తారు. ఈ రోజు ఎక్కువ సమయం వారికి కేటాయిస్తారు.

కిస్ డే (జూన్‌ 14)
కొరియన్ల ఫేవరెట్ డే ఇది. తమ గాఢమైన ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమికులు, భార్యాభర్తలు ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటారు. జంటలకు ఇది బెస్ట్ రొమాంటిక్ డే అని చెప్పుకుంటారు.

సిల్వర్ డే (జులై 14) 
ఈ రోజున ప్రేమికులు ఉంగరాలు మార్చుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే నిశ్చితార్థంలా అనమాట. జీవితాంతం కలిసి ఉంటామని ఇద్దరు ప్రామిస్ చేసుకుని రింగ్స్ మార్చుకుంటారు.

గ్రీన్‌ డే (ఆగస్టు 15)
ఈ రోజున ప్రేమికులు, దంపతులు అందమైన పశ్చికబయళ్లు ఉంటే ప్రదేశాలను సందర్శిస్తుంటారు. అక్కడే భోజనం చేస్తుంటారు. వీలైతే ఆకుపచ్చరంగు దుస్తులు ధరిస్తారు. ఈ రోజు ఫ్యామిలీస్ ఎక్కువగా పార్కులకు వెళ్లి ఆనందంగా గడుపుతారు.

ఫొటో డే (సెప్టెంబర్ 14)
ఈరోజున ప్రేమికులు, స్నేహితులు, ఫ్యామిలీస్ ప్రత్యేకంగా ఫొటోలు దిగుతారు. సెల్ఫీలతో పాటు స్టూడియోలకు వెళ్లి ఫొటో షూట్‌లు నిర్వహిస్తారు. తమ జీవితంలో ఈ రోజు ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చూసుకుంటారు.

వైన్ డే (అక్టోబర్ 14)
ఇది వైన్ ప్రియులకు ఇష్టమైన రోజు. ప్రేమికులు, దంపతులు వైన్ డే రోజున ప్రత్యేక పార్టీలు చేసుకుంటారు. స్నేహితులు,  కుటంబసభ్యులతో కలిసి బార్లకు, పార్టీలకు వెళ్లి ఇష్టమైన వైన్‌ తాగుతారు.

మూవీ డే (నవంబర్ 14)
కొరియన్లకు ఇది కూడా చాలా ఇష్టమైన రోజు. తమ ప్రియమైన వారిని సినిమా హాళ్లలో కలుస్తారు. కొత్త సినిమాలు చూస్తారు. మరికొందరేమో ఇళ్లలోనే డీవీడీలు అద్దెకు తెచ్చుకుని పాప్‌కార్న్ తింటూ మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తారు.

హగ్ డే (డిసెంబర్ 14)
ఈ రోజున కొరియన్ ప్రజలు తమకు ఇష్టమైన వారిని ఆలింగనం చేసుకుంటారు. ప్రేమికులు ఎక్కడున్నా ఈరోజు కలుసుకొని హగ్ ఇస్తుంటారు.  సింగిల్స్ అయితే తమ ఇంట్లో వాళ్లని, స్నేహితులను ఆలింగనం చేసుకుంటారు.
ఏడాదికి 12 రోజులు ఇలా ప్రత్యేకంగా జరుపుకొన్నా.. వాలెంటైన్స్ డే, వైట్ డే రోజుల్లో మాత్రం సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రోజులు వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి.
చదవండి: ప్రేమ కానుక.. మనసు దోచెనిక.. ప్రేమికుల రోజు ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే..!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top