వాష్టింగన్: అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా ఏదో ఒకరోజు అమెరికాకు అధ్యక్షురాలిని కావచ్చు అని అన్నారు. భవిష్యత్తులో శ్వేతసౌధంలో ఓ మహిళా అధ్యక్షురాలు ఉంటుందన్న విశ్వాసం ఆమె వ్యక్తం చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై అమెరికన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తాజాగా ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష పదవి కోసం నేను మరోసారి పోటీచేసే అవకాశం లేకపోలేదు. నా మనవరాళ్లు వారి జీవితకాలంలో కచ్చితంగా ఓ మహిళా అధ్యక్షురాలిని చూస్తారు. బహుశా అది నేనే కావచ్చు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ విషయమై నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉందని భావిస్తున్నాను. వాస్తవానికి నేను చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. నా కెరీర్ మొత్తాన్ని దేశ సేవలో గడిపాను. అది నా రక్తంలో ఉంది అని చెప్పుకొచ్చారు.
Kamala Harris tells the BBC that she may “possibly” run for president again:
“I am not done. I have lived my entire career a life of service and it’s in my bones. There are many ways to serve. I have not decided yet what I will do in the future beyond what I am doing right now.” pic.twitter.com/96QUWYYQkj— Pop Crave (@PopCrave) October 25, 2025
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలనపై స్పందిస్తూ..‘ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ గురించి తాము చేసిన హెచ్చరికలు నిజమే అని ఇప్పుడు నిరూపితం అయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే ఫాసిస్ట్‌లా ప్రవర్తిస్తారని, నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతారని మేము ముందే చెప్పాం. మా అంచనా నిజమైంది. ట్రంప్ న్యాయశాఖను ఆయుధంగా మలచుకుంటానని చెప్పారని, ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు’ అని ఆరోపించారు.
ఇదిలా ఉండగా.. తదుపరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి నిర్వహించిన పోల్స్‌లో డెమోక్రట్ల తరఫున ఆశావహుల రేసులో కమలా హారిస్ వెనుకంజలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా, తాను వాటిని పట్టించుకోనని తెలిపారు. ఒకవేళ ఇలాంటి పోల్స్‌ను పట్టించుకొని ఉంటే, తాను గత ఎన్నికల్లో పోటీపడేదాన్నే కాదని తెలిపారు. ఇక, గత ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి తరఫున కమల పోటీచేసిన విషయం తెలిసిందే.


