అమెరికాలో మరో భారీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. బ్లూ ఆరిజిన్ కంపెనీకి చెందిన న్యూ గ్లెన్ రాకెట్ టెస్టింగ్ సమయంలో ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా అగ్నిగోళంలా భయానక వాతావరణం ఏర్పడింది. అందుకు సంబంధించిన దృశ్యాలు కింద చూడొచ్చు..
బ్లూ ఆరిజిన్ కంపెనీ ప్రముఖ బిలియనీర్ జెఫ్ బెజోస్ స్థాపించిన ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అనే సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం శుక్రవారం వేకువజామున ఫ్లోరిడాలోని లాంచ్ ఫెసిలిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కీలకమైన “హాట్ ఫైర్ టెస్ట్” సందర్భంగా ఇంజిన్లు ఆన్ చేసిన క్షణాల్లోనే అనూహ్యంగా భారీ పేలుడు సంభవించి రాకెట్ ముక్కలు చెక్కలైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#BREAKING
A Blue Origin rocket exploded into a massive fireball during a hotfire test at Cape Canaveral, Florida
The company confirmed an “anomaly” during testing and said all personnel have been accounted for safely
Authorities say no threat to public.
Blue Origin founder… pic.twitter.com/8ndAsxCukC— Nabila Jamal (@nabilajamal_) May 29, 2026
ఈ ఘటనను కంపెనీ సాంకేతిక లోపంగా పేర్కొంటూ వెంటనే విచారణ ప్రారంభించింది. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని బ్లూ ఆరిజిన్ వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనతో కంపెనీ అధినేత జెఫ్ బెజోస్‌కు పెద్ద షాక్ తగిలినట్లుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ ప్రయోగ విఫలంతో బ్లూ ఆరిజిన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. రాకెట్ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు లాంచ్ ప్యాడ్ కూడా దెబ్బతిన్న అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఖర్చు వివరాలు అధికారికంగా వెల్లడించకపోయినా, ఇది అత్యంత ఖరీదైన పరీక్షల్లో ఒకటి కావడంతో భారీ నష్టం వాటిల్లి ఉంటుందని చెబుతున్నారు.
హాట్ ఫైర్ టెస్ట్ అనేది రాకెట్ ప్రయోగానికి ముందు అత్యంత కీలక దశ. ఇందులో రాకెట్‌ను నేలపై స్థిరంగా ఉంచి ఇంజిన్ల పనితీరును పూర్తి స్థాయిలో పరీక్షిస్తారు. ఈ దశలోనే జరిగిన వైఫల్యం మొత్తం ప్రాజెక్ట్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
న్యూ గ్లెన్ రాకెట్ ద్వారా భారీ వాణిజ్య మిషన్లు, నాసా సంబంధిత ఉపగ్రహాలు కక్ష్యలోకి పంపాలని బ్లూ ఆరిజిన్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తాజా పేలుడు కారణంగా ప్రాజెక్ట్ టైమ్‌లైన్ ఆలస్యం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
మరోవైపు..ఈ ఫెయిల్యూర్‌తో బ్లూ ఆరిజిన్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న సంస్థకు ఇది మరో పెద్ద ఎదురు దెబ్బగా మారింది. టెక్నికల్ సమస్యలు, షెడ్యూల్ ఆలస్యాలు కంపెనీ పోటీ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు, ప్రైవేట్ స్పేస్ రేస్ ఎంత ఖరీదైనదో, ఎంత కఠినమో ఈ ఘటన మరోసారి చూపిందని నిపుణులు పేర్కొంటున్నారు.


