గుడ్‌ న్యూస్‌ చెప్పిన జపాన్‌ శాస్త్రవేత్తలు

Japan Researchers Say Ozone Effective in Neutralising Coronavirus - Sakshi

ఓజోన్‌ గ్యాస్‌తో వైరస్‌ వ్యాప్తికి చెక్‌ పెట్టవచ్చని నిరూపణ

టోక్యో: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైరస్‌ బారి నుంచి జనాలను కాపాడటానికి పలు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జపాన్‌ శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్‌ గ్యాస్‌ కరోనా వైరస్‌ కణాలను తటస్తం చేయగలదని తెలిపారు. అందువల్ల ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాలు వంటి ప్రదేశాల్లో దీన్ని డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌గా ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఫుజిటా హెల్త్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఒక సమావేశంలో మాట్లాడుతూ.. ఓజోన్ వాయువు 0.05 నుంచి 0.1 పీపీఎం, మానవులకు హానిచేయనిదిగా భావించే స్థాయి వైరస్‌ని చంపగలదని గుర్తించాము అన్నారు

ఈ ప్రయోగంలో వారు కరోనా వైరస్ నమూనా ఉన్న కలిగిన మూసివున్న గదిలో ఓజోన్ జనరేటర్‌ను ఉపయోగించారు. దాదాపు 10 గంటల పాటు తక్కువ సాంద్రత గల ఓజోన్‌ గ్యాస్‌ను ఉపయోగించడం వలన.. వైరస్‌ శక్తి 90 శాతం తగ్గినట్లు గుర్తించామన్నారు. ఈ సందర్భంగా చీఫ్‌ సైంటిస్ట్‌ తకాయుకి మురాటా మాట్లాడుతూ..  ‘కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడం కోసం.. ప్రజలు ఉన్న వాతావరణంలో కూడా నిరంతర, తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువును పంపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అధిక తేమతో కూడిన పరిస్థితుల్లో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని మేము గుర్తించాము’ అన్నారు. ఓజోన్, ఒక రకమైన ఆక్సిజన్ అణువు. ఇది అనేక వ్యాధికారకాలను క్రియారహితం చేస్తుంది. 1-6 పీపీఎం మధ్య అధిక సాంద్రత కల ఓజోన్‌ వాయువు కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే ఈ అధిక సాంధ్రత మానవులకు విషపూరితమైనది అని గతంలో చేసిన ప్రయోగాలు నిరూపించాయి. (చదవండి: వారియర్స్‌పై వైరస్‌ పంజా!)

జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం మనం నిత్యం వాడే గౌన్లు, గాగుల్స్, ఇతర వైద్య రక్షణ పరికరాలను డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌ చేయడంలో ఓజోన్ ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. సెంట్రల్ జపాన్‌లోని ఐచి ప్రిఫెక్చర్‌లోని ఫుజిటా మెడికల్ యూనివర్శిటీ హాస్పిటల్, వెయిటింగ్‌ రూంలు, రోగుల గదుల్లో వైరస్‌ సంక్రమణను తగ్గించడానికి ఓజోన్ జనరేటర్లను ఏర్పాటు చేసింది. (చదవండి: మాస్కులతో పెరుగుతున్న నిర్లక్ష్యం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top