విదేశీ పర్యటనలో భాగంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ చేరుకున్నారు. రోమ్‌లో మోదీకి ఇటలీ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ ఘన స్వాగతం పలికారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని చివరగా ఇక్కడ పర్యటించబోతున్నారు.
నా స్నేహితుడికి రోమ్ నగరం స్వాగతం పలుకుతోంది అంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచారు. అంతకు ముందు.. ఇద్దరూ కలిసి ఒకే కారులో ప్రయాణించారు. ఇటలీ చారిత్రక కోలోసియం సందర్శించారు. అక్కడ సెల్ఫీ కూడా దిగారు. వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో రోమ్‌లో మెలోడీ#Melodi మూమెంట్స్ అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. మోదీ, మెలనీ పేర్లను కలిపి అలా సరదాగా పిలుస్తారన్నది చాలామందికే తెలిసే ఉంటుంది. వీళ్ల స్నేహంపై సోషల్ మీడియాలో తరచూ చర్చ నడుస్తుంటుంది కూడా.
Welcome to Rome, my friend! 🇮🇹🇮🇳 pic.twitter.com/mUjFL4HIqY
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 19, 2026
మోదీ 2024లో జీ7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్లారు. అయితే అధికారిక ద్వైపాక్షిక పర్యటన మాత్రం ఇదే. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య మిత్రబంధాన్ని కాస్త వ్యూహాత్మక సంబంధంగా మార్చాలని మోదీ భావిస్తున్నారు. వాణిజ్యం, రక్షణ, సముద్ర భద్రత, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
తొలుత ఇటలీ అధ్యక్షుడు సెర్జియో మట్టారెల్లాతో మోదీ భేటీ అవుతారు. అటుపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఎఫ్‌ఏవో (Food and Agriculture Organisation) ప్రధాన కార్యాలయం సందర్శించి అక్కడ ఆహార భద్రత అంశంలో భారత్ వైఖరిని మోదీ చాటిచెప్పే అవకాశం ఉంది. అలాగే..
ఇండియా-మిడిల్‌ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) ద్వారా వాణిజ్య, రవాణా, కనెక్టివిటీ విస్తరణ అంశాలను చర్చించనున్నారు. రక్షణ, సముద్ర భద్రత, సరఫరా గొలుసులు, టెక్నాలజీ, వాణిజ్యం రంగాల్లో సహకారం కోసం రూపొందించిన Joint Strategic Action Plan 2025–2029 పైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ ఎనర్జీ, మొబిలిటీ, డిఫెన్స్ తయారీలో కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలపైనా చర్చిస్తారని సమాచారం.
ప్రవాస భారతీయులతో..
రోమ్‌లోని హోటల్ వద్ద భారతీయ ప్రవాసులు మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. వారణాసి ఘాట్‌లను ప్రతిబింబించే చిత్రకళా బహుమతి అందించారు. సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు కూడా జరిగాయి.
ఈ పర్యటన భారత్–ఇటలీ సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశంగా భావిస్తున్నారు. రక్షణ, వాణిజ్యం, సముద్ర భద్రత, ఆహార భద్రత రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేయడం ద్వారా యూరప్‌లో భారత్ వ్యూహాత్మక స్థానం మరింత బలపడనుంది. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, డిఫెన్స్ తయారీ రంగాల్లో కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది.


