
కైరో: యెమెన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హౌతీ తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రధానమంత్రి అహ్మద్ అల్ రహావి చనిపోయారు. గురువారం జరిగిన ఈ దాడుల్లో రహావితోపాటు పలువురు మంత్రులు కూడా ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ అండతో చెలరేగుతున్న హౌతీ రెబల్స్ ప్రకటించారు. 2024 ఆగస్ట్ నుంచి రహావి ప్రధాని బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
ఏడాది కాలంలో తమ ప్రభుత్వ పనితీరు, కార్యక్రమాల అమలుపై సమీక్ష జరుపుతుండగా ఈ దాడి జరిగినట్లు హౌతీలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హౌతీ ఉగ్ర పాలకులే లక్ష్యంగా సనాపై సైనిక దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులను ఖండిస్తూ, పాలస్తీనియన్లకు సంఘీభావంగా హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్‌పై క్షిపణి, రాకెట్ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.