
టెల్‌అవీవ్: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లు ఆదివారం ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడికి పాల్పడ్డారు. హౌతీలు ప్రయోగించిన డ్రోన్ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని ఎయిలట్‌కు సమీపంలోని రమోన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్యాసింజర్ టెర్మినల్‌ను తాకింది. కిటికీల అద్దాలు పగిలిపోయి, పొగలు కమ్ముకున్నాయి. ఒకరికి గాయాలయ్యాయి. ఘటన నేపథ్యంలో విమానాశ్రయంలో రాకపోకలను సుమారు రెండు గంటలపాటు నిలిపివేశారు.
కొన్ని విమానాలను దారి మళ్లించారు. హౌతీలు ప్రయోగించిన మూడు డ్రోన్లను తమ భూభాగంలోకి ప్రవేశించకమునుపే కూల్చి వేసినట్లు అంతకుముందు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఒక డ్రోన్ మాత్రం తప్పించుకుందని పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది. దాడుల నేపథ్యంలో దక్షిణ ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. దీంతో, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
వారం క్రితం రాజధాని సనాపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో హౌతీల ప్రభుత్వ ప్రధాని అహ్మద్ అల్–రహావీ చనిపోవడం తెల్సిందే. తమ ప్రత్యేక మిలటరీ ఆపరేషన్‌తో శత్రు దేశం విమానాశ్రయాలకు భద్రత లేదన్న విషయం రూఢీ అయ్యిందని హౌతీలు ప్రకటించుకున్నారు. పాలస్తీనాకు మద్దతు తెలుపుతున్న హౌతీలు తరచూ ఇజ్రాయెల్‌పైకి దాడులకు దిగుతున్నారు. ఎర్ర సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలపైనా దాడులకు తెగబడి, వాటిని ముంచేస్తున్నారు.
మిలటరీ ఆపరేషన్ ఆగదు: నెతన్యాహూ
గాజా నగరంలో చేపట్టిన భారీ ఆపరేషన్ కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. హమాస్‌కు పట్టుకున్న గాజా, మరిముఖ్యంగా గాజా నగరం నుంచి హమాస్‌ను నిర్మూలించడమే లక్ష్యమని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ముందస్తు ప్రయత్నాలు చేపట్టేందుకు ఇప్పటికే లక్షమంది పాలస్తీనియన్లు నగరాన్ని వదిలి వెళ్లిపోయారన్నారు. ఇలా ఉండగా, ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన వైమానిక దాడుల్లో కనీసం 13 మంది చనిపోయారు.