యుద్ధం ఆగాలంటే.. మోదీతో ఇరాన్‌ అధ‍్యక్షుడు ఏమన్నారంటే? | Iran on what President Pezeshkian told PM Modi | Sakshi
Sakshi News home page

యుద్ధం ఆగాలంటే.. మోదీతో ఇరాన్‌ అధ‍్యక్షుడు ఏమన్నారంటే?

Mar 21 2026 9:29 PM | Updated on Mar 21 2026 9:29 PM

Iran on what President Pezeshkian told PM Modi

టెహ్రాన్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్ శనివారం ఫోనులో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పేజెష్కియన్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణకు పరిష్కారం రావాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలను నిలిపివేయాలని చెప్పారు. అలాగే ప్రాంత స్థిరత్వం కోసం బ్రిక్స్ మరింత ముఖ్యమైన పాత్ర పోషించాలని కోరారు.

ఇద్దరు నేతల మధ్య టెలిఫోన్ సంభాషణలో ద్వైపాక్షిక సంబంధాలు, అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చ జరిగినట్టు పేజెష్కియన్ పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులను ఆయన ప్రస్తావించారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా దాడులను నిలిపివేయడం, ప్రాంతీయ, గ్లోబల్ స్థిరత్వాన్ని కాపాడటం కోసం బ్రిక్స్‌ స్వతంత్ర పాత్ర పోషించాలని పేజెష్కియన్ కోరారు. భారతదేశం ప్రస్తుతం బ్రిక్స్‌కు అధ్యక్ష హోదాలో ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఇరాన్‌ అధ‍్యక్షుడు ప్రస్తావనకు తెచ్చారు.

పశ్చిమాసియా దేశాల మధ్య ప్రాంతీయ భద్రతా వ్యవస్థ ఏర్పాటును కూడా పేజెష్కియన్ ప్రతిపాదించారు. విదేశీ జోక్యం లేకుండా శాంతి, స్థిరత్వం సాధించాలని సూచించారు.

ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రకటనలో బ్రిక్స్ గురించి ప్రస్తావించలేదు. అయితే, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత వారం ఇరాన్‌తో జరిగిన సంభాషణల్లో బ్రిక్స్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపారు.

ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో తాను ఇటీవల ఫోన్‌లో మాట్లాడినట్లు జైశంకర్ చెప్పారు. “ఇరాన్ విదేశాంగ మంత్రితో మరోసారి మాట్లాడాను. ద్వైపాక్షిక అంశాలు, బ్రిక్స్ సంబంధిత విషయాలపై చర్చించాం” అని తెలిపారు.

హామీలు అవసరం: పేజెష్కియన్ 
ఘర్షణ తగ్గాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆగాలని, భవిష్యత్తులో దాడులు జరగవన్న హామీలు అవసరమని ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియన్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఆయన అమానుషం, అనైతికం అని పేర్కొన్నారు.

ఇరాన్ యుద్ధం ప్రారంభించలేదని, అన్యాయంగా ఇజ్రాయెల్‌-అమెరికా దాడులు ప్రారంభించాయని మోదీకి పేజెష్కియన్ తెలిపారు. అణు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయని అన్నారు. ఈ దాడుల్లో ఉన్నత స్థాయి నాయకులు, సైనికాధికారులు, పౌరులు మరణించారని, పాఠశాల పిల్లలు కూడా బలయ్యారని తెలిపారు. ప్రజా మౌలిక వసతులపై కూడా దాడులు జరిగినట్టు చెప్పారు. మినాబ్ ప్రాంతంలో ఒక పాఠశాలపై దాడి జరిగి 168 మంది పిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఈ దాడి సమీప దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల నుంచి జరిగినట్టు ఆరోపించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement