అది దేశం దాటివెళ్తే మన సంగతి అంతే: ఇరాన్‌ | Iran Supreme Leader Mojtaba Khamenei hardens stand | Sakshi
Sakshi News home page

అది దేశం దాటివెళ్తే మన సంగతి అంతే: ఇరాన్‌

May 21 2026 8:24 PM | Updated on May 21 2026 8:47 PM

Iran Supreme Leader Mojtaba Khamenei hardens stand

టెహ్రాన్: ఇరాన్‌, అమెరికా మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దేశం బయటకు వెళ్లకూడదని ఆదేశించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్‌ వదులుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన కీలక డిమాండ్‌ను ఇరాన్ మొదటి నుంచి నిరాకరిస్తోంది.

అణ్వాయుధ తయారీలో కీలక భాగమైన శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పూర్తిగా ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచి బయటకు తరలిస్తామని ట్రంప్ గతంలో ఇజ్రాయెల్‌కు హామీ ఇచ్చారని ఇజ్రాయెల్ అధికారులు రాయిటర్స్‌కు తెలిపారు.

ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు. శుద్ధి చేసిన యురేనియాన్ని పూర్తిగా ఇరాన్ అధీనంలో లేకుండా చేసేవరకు, ప్రాంతీయ ప్రాక్సీ మిలీషియాలకు టెహ్రాన్ ఆర్థిక, సామగ్రి సహాయం పూర్తిగా ఆపే వరకు వెనక్కి తగ్గబోమన్నారు. అలాగే, ఆ దేశ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసే వరకు యుద్ధ విరమణపై ఆలోచించబోమని ఆయన స్పష్టం చేశారు.

అయితే ఈ వైఖరికి టెహ్రాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అత్యంత సున్నితమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా పేరు వెల్లడించకుండా మీడియాతో మాట్లాడారు ఇరాన్ వర్గాలకు చెందిన ఓ ప్రతినిధి. “సుప్రీం లీడర్ ఆదేశం స్పష్టంగా ఉంది. శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దేశం బయటకు వెళ్లకూడదన‍్నారు” అని తెలిపారు.

అదే వర్గాలు మరో విషయం వెల్లడించాయి. ఈ పదార్థాన్ని విదేశాలకు పంపితే తమ దేశ భద్రత తీవ్రంగా బలహీనపడుతుందని, భవిష్యత్తులో వాషింగ్టన్, టెల్ అవీవ్ నుంచి సైనిక దాడులను ఎదుర్కోలేదని చెప్పాయి. ఇరాన్ అగ్ర పరిపాలనా, సైనిక వర్గాలు ఈ విధంగానే భావిస్తున్నాయి. ఇరాన్ రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం కీలక ప్రభుత్వ విధానాలపై తుది అధికారం సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటుందని రాయిటర్స్ తెలిపింది.

అమెరికా దాడులు చేయనుందా? 
ఇరాన్ సీనియర్ వర్గాల సమాచారం ప్రకారం.. టెహ్రాన్ రాజకీయ వ్యవస్థలో తీవ్ర అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం యుద్ధ తీవ్రత పూర్తిగా తగ్గినట్టుగా చూపడం అమెరికా వ్యూహాత్మక మోసమని, తప్పుడు రీతిలో భద్రతాభావం కలిగించి మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించాలన్న యత్నమని చాలామంది భావిస్తున్నారు.

ఈ భయాలకు బలం చేకూర్చుతూ ఇరాన్ ప్రధాన శాంతి చర్చల ప్రతినిధి బాక్వెర్‌ తాజాగా మాట్లాడుతూ.. “శత్రువు బహిరంగ, రహస్య కదలికలు చూస్తే అమెరికా సైన్యం కొత్త దాడుల సన్నాహాల్లో ఉందని స్పష్టమవుతోంది” అన్నారు.

ఇదిలా ఉండగా, సమగ్ర శాంతి ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే ఆ దేశంపై మరోసారి సైనిక దాడులు ప్రారంభించేందుకు అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉందని ట్రంప్ బుధవారం ప్రకటించారు. అయితే సరైన సమాధానాలు రావడానికి కొన్ని రోజుల గడువు ఇస్తామన్న సంకేతం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement